నవాబ్‌సాబ్‌.. ఆదాబ్‌

4

– మీర్‌ అహ్మద్‌ అలీ జయంతి నేడు

– మన సాగునీటి రంగ పితామహుడు

– తెలంగాణ ఇంజినీర్స్‌ డే జులై 11

– శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జులై 11 (జనంసాక్షి):

మరుగున పడిన మట్టిలోని మాణిక్యాలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం పుణ్యమాని మళ్లీ త’లుక్కు’మంటున్నాయి. అదే కోవలోకి వస్తారు మన సాగునీటి రంగ పితామహుడు నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌. ప్రఖ్యాత ఇంజినీర్‌ అయిన ఆయన రూపుదిద్దిన జలాశయాల్లో హిమాయత్‌సాగర్‌, నిజామాబాద్‌ జిల్లాలోని నిజాంసాగర్‌, శ్రీరాంసాగర ్‌(పోచంపాడు), ఖమ్మం జిల్లా వైరాసహా పాలేరు, నందికొండ, బీమా వంటివి ఉన్నాయి. ఈ భారీ, మధ్యతరహా ప్రాజెక్టులే కాకుండా చరిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల భవంతి, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి భవనం లాంటివి ఆయన పనితీరుకు నిలువెత్తు సజీవ సాక్ష్యాలు. నిజానికి అప్పట్లో ఆంధ్రా గుప్పిట్లోకి తెలంగాణ వెళ్లకుంటే నవాబ్‌ మరెన్నో అద్భుత కట్టడాలను మనకు ప్రసాదించేవారని చరిత్ర తెలిసిన వారు ప్రస్తావిస్తున్నారు. ప్రముఖ ఇంజినీర్‌ సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమకాలికుడైన నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ అసలు పేరు మీర్‌ అహ్మద్‌ అలీ. హైదరాబాద్‌లో 1877 జూలై 11న జన్మించిన ఈ హైదరాబాద్‌ తొలి చీఫ్‌ ఇంజినీర్‌. 22 ఏళ్ల ప్రాయంలోనే ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా ప్రస్థానం మొదలెట్టారు. నిజామాబాద్‌ జిల్లాలోని అలీసాగర్‌ ఈయన పేరిటే ఉంది. సేద్యపునీటి ప్రాజెక్టులు, భారీ బ్యారేజీలు, భవనాలు వంటి నిర్మాణ రంగాల్లో తన మేథోసంపత్తిని ధారపోసి తెలంగాణకే కాకుండా యావత్‌ దేశానికి సేవలందించారు. తద్వారా విలువైన జాతి సంపదకు బాటలు వేశారు. అలాంటి అలీకి అరుదైన గౌరవం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో తాజాది. జూలై 11 (నేడు) తెలంగాణ ఇంజినీర్స్‌ డేగా జరుపుకోవాలని సర్కారు నిశ్చయించింది. ఈ సముచిత గుర్తింపుపట్ల మన ప్రాంత ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకమీదట ఏటా జూలై 11 తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంగా రికార్డుల్లోకి ఎక్కనుంది. మీర్‌ అహ్మద్‌ అలీని స్మరించుకొని స్ఫూర్తి పొందేందుకు ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అనంతరం తెలంగాణ ఇంజినీర్లకు  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ సాకారంలో ఇంజినీర్ల భూమిక ఎంతో కీలకమైనదని, భావితరాల కోసం మరిన్ని సేవలతో పునరింకితమవుదామని అబిలాషించారు. మరోవైపు భాగ్యనగరంలోని ఎర్రమంజిల్‌ జలసౌధ ప్రాంగణంలో అలీ నవాజ్‌ జంగ్‌ విగ్రహాన్ని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం ఆవిష్కరించనున్నారు.