ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్చాలి

2

తెలంగాణలోని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

17న కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటన హైదరాబాద్‌,

జూలై 11 (జనంసాక్షి) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈనెల 17న క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జూరాల-పాకాల, పాలమూరు ప్రాజెక్టులను త్వరతిగతిన పూర్తి చేయాలని, వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సాగునీటి పారుదల శాఖలో అవినీతిని సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కృష్ణా, గోదావరి నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ యోగ్యమైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఇందుకోసం తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని అన్నారు. ఈక్రమంలో కొండ, మారుమూల ప్రాంతాలకు అవసరమైతే మోటార్‌ సైకిళ్ల ద్వారా చేరుకుంటానని చెప్పారు. రాష్ట్ర సాగునీటి అవసరాల రీత్యా ఈ రెండు నదుల్లోని జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తన పర్యటనలో సాగునీటి రంగ నిపుణులు, ఇంజినీర్లు, ప్రభుత్వ సలహాదారులు కూడా పాల్గొంటారని తెలిపారు. తాను వ్యక్తిగతంగా ప్రతి ప్రాంతాన్ని సందర్శించడంతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన డిజైన్‌ రూపకల్పనలో పాల్గొంటానని సీఎం అన్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న అవకాశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట వలస పాలకులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోయారని ఆయన తెలిపారు. ఇకపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టర్లకు కాసులు రాల్చేదిగా కాకుండా రైతులకు మేలు చేసే విధంగా ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, విధానాల్లో అవగాహన లేమి, డిజైన్ల రూపకల్పనలో పొరపాట్ల కారణంగా నష్టం వాటిల్లిందని, ఇలాంటి వాటికి మన రాష్ట్రంలో తావులేదని సీఎం స్పష్టం చేశారు.