భగ్గుమన్న తెలంగాణ

4

పోలవరం బిల్లుకు నిరసనగా నేడు తెలంగాణ బంద్‌

పలుచోట్ల నిరసనలు

ఆదివాసీలను ముంచేందుకే ఈ బిల్లు : జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) :

పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో విలీనం చేయడంపై తెలంగాణ భగ్గుమంది. పోలవరంపై అమీతుమీకి తెలంగాణ సర్కార్‌ సిద్ధం అవుతుండగా, లోక్‌సభలో పోలవరం బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌ పాటించాలని రాజకీయ ఐకాస చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్‌కు అందరూ మద్దతివ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం వైఖరి ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. గిరిజనులకు కూడా ప్రత్యేక హక్కులు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా కేంద్రం గిరిజన హక్కులను కాలరాసిందన్నారు. పోలవరం బిల్లు ఆమోదంపై వామపక్షాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. శనివారం తెలంగాణలో బంద్‌ పాటించాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌)లు కూడా పిలుపునిచ్చాయి. ఇదిలావుంటే సుప్రీంలో న్యాయపోరాటం చేయాలని సర్కర్‌ నిర్ణయించింది. దీంతో పోలవరంపై ఇక గట్టిగానే తమ నిరసన తెలుపుతామని కోదండరామ్‌ అన్నారు. పోలవరం ముంపు మండలాలను ఆంధప్రదేశ్‌లో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టంపై తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు ఈ చట్టాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌ డివిజన్‌ను బంద్‌ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులపై దాడి చేసిందని మండిపడ్డారు. లోక్‌సభలో ఇవాళ జరిగింది అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.  పోలవరం బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం తెలపడంపై ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీనిపై తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. గిరిజననుల జీవితాలకన్నా వీరికి పట్టింపులు ఎక్కువయ్యాయని అన్నారు. నిరసనల మధ్య బిల్లు ఆమోదం తొందరపాటు చర్యేనని అయన అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విూడియతో మాట్లాడుతూ బిల్లు ఆమోదం అన్యాయమైన, ప్రజాస్వామికమైన నిర్ణయమిదని ఆయన అన్నారు. రాష్టాల్ర సరిహద్దులతో పాటు ఇతర సమస్యలు తప్పవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుపై చర్చ జరగాల్సి ఉందని కోదండరామ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.  పోలవరం ముంపు గ్రామాలను ఆంధప్రదేశ్‌ రాష్టాన్రికి బదలాయిస్తూ పార్లమెంటు  బిల్లును ఆమోదించిన తీరు ఆక్షేపణీయమని కోదండరాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఆంధప్రదేశ్‌ ప్రజలకు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ ఆదివాసీల ప్రజలను నీట ముంచే చర్యలకు దిగడం సరి కాదన్నారు. ప్రధాని మోడీ లక్షల మంది ఆదివాసీల ఆక్రందనలు వినిపించుకోకుండా ఇద్దరు నేతల మాటలు వింటున్న తీరు సరికాదన్నారు. కనీసం పోలవరం ముంపు ప్రాంతాల విషయంపై మాట్లాడేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పోలవరం ముంపు భూములను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 14న ఢిల్లీలో ఆదివాసీలతో ధర్నా నిర్వహిస్తున్నట్లు కోదండరాం తెలిపారు. అనుమతులు లేకుండానే పోలవరం ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం గిరిజనుల పాలిట శాపమని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వ్యాఖ్యానించారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా శనివారం ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.

ఖమ్మం : పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా ఇకముందు ఆందోళన ఉధృతం చేయాలని  తెలంగాణ గిరిజన సంఘం నిర్ణయించింది. గిరిజనులను ముంచడమే లక్ష్యంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నదని మండిపడింది. దీంతో ఈ నెల 14న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి దుగ్గి కృష్ణ అన్నారు. త్వరలోనే దీనిపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. వెల్లడించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని వివరించారు. సన్నాహక చర్యల్లో భాగంగా ఈనెల 12న ఖమ్మం జిల్లా బంద్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలిసారిగా గిరిజనుల బతుకులతో ఆటలాడుతోందని విమర్శించారు. జిల్లాలోని ఏడు మండలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రలో కలపడానికి వీలు లేదన్నారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా ఏకపక్షంగా పీసా చట్టం వంటి గిరిజన చట్టాల ఉల్లంఘిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం చెల్లుబాటు కాబోదన్నారు. ఇదిలావుంటే విభజనలో కీలకమైన పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధప్రదేశ్‌కు బదలాయించే విషయంలో ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బూర్గంపాడు భవితవ్యంపై మరలా నీలినీడలు పరుస్తున్నాయి. కుదిరితే బూర్గంపాడు మండలం మొత్తాన్ని, లేదంటే కనీసం బూర్గంపాడు రెవెన్యూ గ్రామాన్నైనా ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో కలుపుకోవాలని ఆ రాష్ట్ర ఎంపీలందరూ పట్టుదలగా ఉన్నారు. పోలవరం ముంపు ప్రాంతంలో ఏఏ గ్రామాలను ఆంధప్రదేశ్‌కు బదలాయిస్తారో? ఏఏ గ్రామాలను మినహాయిస్తారో? అనే విషయంలో నేటికీ స్పష్టత కరవైంది. ఆర్డినెన్స్‌నే బిల్లుగా ఆమోదిస్తే చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా, భద్రాచలం పట్టణం మినహా ఆ మండలంలో మిగిలిన గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని 6 రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఆంధప్రదేశ్‌లో కలుస్తాయి. తాజాగా పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లుకు కూడా ఆంధప్రదేశ్‌ ఎంపీలు సవరణలు ప్రతిపాదించి, బూర్గంపాడును కూడా తమ రాష్ట్రంలో కలుపుకునేందుకు ‘లాబీయింగ్‌’ చేస్తూ జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్‌లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఆధిక్యం ఉండటంతో,  బూర్గంపాడు మండలవాసులను కలవరానికి గురి చేస్తోంది. ఈ మండలంలోని ప్రజలంతా తెలంగాణలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నప్పటికీ పార్లమెంట్‌లో జరుగనున్న నిర్ణయం ఏవిధంగా ఉంటుందోనని భయపడుతున్నారు.ప్రధానంగా బూర్గంపాడును ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో కలిపితే, భద్రాచలం పుణ్యక్షేత్రానికి రహదారి సదుపాయం ఉండదనే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. రహదారి సదుపాయంపై ఉన్న అడ్డంకిని తొలగించేందుకు బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌ నుంచి ఉప్పుసాక, టేకులచెరువుల విూదుగా ముసలిమడుగు వైపు ఉన్న రహదారి అవకాశాలను కూడా తెరపైకి తెస్తున్నారు. ఈ రింగ్‌ రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడం కూడా సులువుగా ఉంటుందనే ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఆంధ్ర ఎంపీలు సిద్ధమవుతున్నారు.