8 ఏళ్ల తెరాస పాలనలోని తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి);
8 ఏళ్ల తెరాస పాలనలోని తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాల్లో భాగంగా శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న రాజరిక పాలన వద్దని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి స్వతంత్ర భారతావనిలో విలీనం చేయించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు, దళిత బంధు, కెసిఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతోందని చెప్పారు. గతంలో రైతులు వ్యవసాయం చేయడానికి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసేవారని, రాష్ట్ర ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేసి ఎకరానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని పేర్కొన్నారు. రైతు చనిపోతే రైతు బీమా ద్వారా వారి కుటుంబానికి పది రోజుల లోపు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందని పేర్కొన్నారు. ప్రాంతాభివృద్ధికి నాయకులు పోటీపడి ప్రజాసేవ చేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగాన్ని సమన్వయపరిచి సమర్థవంతంగా జిల్లా కలెక్టర్ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న జిల్లా పోలీసులకు, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయులకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఏడాది పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు తెలంగాణ రాష్ట్ర చరిత్రను తెలిపేందుకు ఈ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా ఆదివారం నియోజకవర్గ కేంద్రాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి మెడికల్ కాలేజీకి ప్రభుత్వం రూ.230 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. 57 ఏళ్లు దాటిన వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 238 గురుకుల పాఠశాలలు ఉండేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత వాటి సంఖ్య 1000 కి పెరిగిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని చెప్పారు. అంతకుముందు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు వెంకటేష్ దోత్రే, చంద్రమోహన్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ శోభ, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.