నిజం మాట్లాడేందుకూ దమ్ము కావాలి

4th-main-26
‘హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌ భారతదేశంలో భాగం కావు, భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా బలవంతంగా ఈ రెండు దేశాలను తనలో విలీనం చేసుకుంది’ నిజామాబాద్‌ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత పార్లమెంట్‌ నిండు సభలో ప్రసంగిస్తూ అన్న మాటలివి. ఈ మాటలను భారత మీడియా అంతగా పట్టించుకోకపోగా పాకిస్తాన్‌ మీడియా మాత్రం పతాక శీర్షికల్లో ప్రచురించింది. కవిత పార్లమెంట్‌లో మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పులేదు. ఆమె చరిత్రను వక్రీకరించలేదు. సొంతభాష్యాలూ చెప్పలేదు. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించిన భారతదేశం భౌగోళిక స్వరూపం ఇలా ఉండేది కాదు. ఇది జగమెరిగిన సత్యం. భారత ప్రభుత్వ మొట్టమొదటి హోం శాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ సైనిక చర్య ద్వారా వందలాది సంస్థానాలను భారత్‌లో విలీనం చేయించారు. జమ్మూకశ్మీర్‌, హైదరాబాద్‌ దేశాలు అప్పటికీ స్వతంత్రంగానే ఉన్నాయి. అప్పుడు భారతదేశం చిత్రపటం ఇప్పుడున్నట్టుగా ఉండేది కాదు. 1948 సెప్టెంబర్‌ 17వ తేదీ వరకూ హైదరాబాద్‌ స్టేట్‌ స్వతంత్ర దేశమే. సర్దార్‌ పటేల్‌ హైదరాబాద్‌పైకి దండెత్తివచ్చి నిజాం సైన్యాన్ని ఓడించి భారత్‌లో విలీనం చేయించాడు. అప్పటికీ నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ ప్రపంచ దేశాలతో పాటు ఐక్య రాజ్యసమితికి భారత సైన్యం తమ దేశాన్ని బలవంతంగా విలీనం చేయించుకున్నదని మొరపెట్టుకున్నాడు. అయితే హైదరాబాద్‌ సంస్థానంలోని మెజార్టీ ప్రజలు ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడానికి మానసికంగా సిద్ధపడటంతో ఆ తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. అప్పటి హైదరాబాద్‌ దేశంలోని నాందేడ్‌, బీదర్‌ ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కలుపగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ స్టేట్‌గా ఉండేది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఆగస్టు 15, 1947న అయితే హైదరాబాద్‌ ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయ్యింది సెప్టెంబర్‌ 17, 1948న. పటేల్‌ సైన్యం హైదరాబాద్‌పైకి దండెత్తి వచ్చింది నిజం. నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌అలీ ఖాన్‌ రష్యా తదితర దేశాల సాయం కోరిన మాటా నిజం. ఐక్యరాజ్య సమితికి సైనిక చర్యపై భారత ప్రభుత్వం ఇచ్చిన సమాచారం వేరు.. హైదరాబాద్‌ సంస్థానంలో పటేల్‌ సైన్యం సాగించిన అకృత్యాలు వేరు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకవైపు నిజాం సైన్యాన్ని, మరోవైపు కమ్యూనిస్టులను మట్టుబెట్టి మరుభూమిగా మార్చింది పటేల్‌ సైన్యం. లక్షలాది మంది అమాయకులనూ హత్య చేసి వారి మృతదేహాలను బావులు, చెరువులు, కాలువల్లో పడవేసింది. హైదరాబాద్‌ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాగా పాలకులు మాత్రం ముస్లింలు. నిజాం సైన్యం, రజాకర్ల ముసుగున దేశ్‌ముఖ్‌లు, పట్వారీలు గ్రామాల్లో సాగించిన అరాచకాలతో ప్రజల్లో పాలకులపై వ్యతిరేకత ఏర్పడింది. దాన్ని పటేల్‌ సైన్యం ఉపయోగించుకుంది. అలాగే జమ్మూకశ్మీర్‌ 1947 అక్టోబర్‌ 26న భారత్‌లో విలీనమైంది. అయితే ఆర్టికల్‌ 370 ప్రకారం ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. అంటే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 70 రోజుల అనంతరం జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తితో భారత్‌లో అంతర్భాగమైంది. కానీ అందులో కొంత భూభాగం పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌గా ఆ దేశ అధీనంలో ఉంది. మరికొంత భాగం చైనా ఆక్రమణలో ఉంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం నూటికి నూరుపాళ్లు భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తోంది. తెలంగాణ ప్రజలు తాము భారతీయులమనే చెప్పుకుంటున్నారు తప్ప వేరే వ్యాఖ్యలు చేయడం లేదు. హైదరాబాద్‌ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయడం, సీమాంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, ఇతరత్రా కారణాలతో ఆత్మగౌరవం, స్వపరిపాలనను కోరుతూ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించారే తప్ప స్వతంత్ర దేశం కావాలని కాదు. అయితే పార్లమెంట్‌లో కవిత చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆక్షేపణల పేరుతో హద్దులు దాటుతున్నారు. దేశాన్ని మాతగా కొలిచే సమాజానికి ప్రతినిధులమని చెప్తూనే ఒక మహిళా ఎంపీపై నోటికి వచ్చినట్లు దూషణలు చేస్తున్నారు. ఎంపీ కవిత మాట్లాడిన మాటలో తప్పులేదు. ఆమె ఎలాంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసిందనే విషయాన్ని పట్టించుకోకుండా ఆమెపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌ను విలీనం చేయించుకున్న మాట వాస్తవం. అందుకు సైనిక చర్యను ఉపయోగించుకున్నదీ నిజం. హైదరాబాద్‌పై పటేల్‌ సైన్యం దండెత్తిరాగా, కశ్మీర్‌ రాజు కోరిక మేరకు జమ్మూకశ్మీర్‌ వ్యవహారాల్లో భారత సైన్యం జోక్యం చేసుకుంది. తెలంగాణ భారత్‌లో సంపూర్ణంగా కలిసిపోగా జమ్మూకశ్మీర్‌ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇందుకు భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉదాసీన వైఖరే కారణమని చెప్తారు. చరిత్ర చెప్తోన్నదే ఎంపీ కవిత చెప్పారు. దాన్ని రాద్దాంతం చేసి టీఆర్‌ఎస్‌ను, కవితను, సీఎం కేసీఆర్‌ను దేశద్రోహులుగా చిత్రీకరించే పనిలో కొందరు పీకల్లోతు కూరుకుపోయారు. ఈక్రమంలో యుక్తాయుక్త విచక్షణను మరుస్తున్నారు. ఉచితానుచితాలను విస్మరిస్తున్నారు. నిజాలు చెప్పడానికి ఎంతో దమ్ము, గుండె ధైర్యం కావాలి. నిజాలను ఒప్పుకోవడానికి కూడా అంతే దమ్మూ, ధైర్యం అవసరం. నిజాలను నిజాయితీగా అంగీకరించలేని వాళ్లు విశ్వసనీయులు కాలేరు. కవిత మాట్లాడినదాట్లో నిజం ఉంది. అర్ధసత్యాలో, అసత్యాలనో మాట్లాడిన అనవసర పబ్లిసిటీని ఆమె కోరుకోలేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పారు. దాన్ని స్వాగతించాలి. చరిత్రపై చర్చకు సిద్ధపడాలి. పొరబాట్లు, తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి. అంతేతప్ప వ్యక్తిగత దూషణలకు దిగితే యావత్‌ జాతి ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. దీన్ని భారతీయత అంటామో.. ఇంకేమంటామో మన కుహన జాతీయవాదులకే తెలియాలి.