తెలంగాణలో అపారమైన ఖనిజ సంపద అభివృద్ధికి తోడ్పడాలి

5
మానవ, సహజ వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి

అంకాపూర్‌లో ఆధునిక వ్యవసాయ పరిశోధన కేంద్రం

నిజామాబాద్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి

చత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుచేయండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష.. ఆదేశాలు

హైదరాబాద్‌, జులై 31 (జనంసాక్షి) : నిజామాబాద్‌ జిల్లాలోని గుత్ప ఎత్తిపోతల పథకాన్ని, పోచారం ప్రాజెక్టును విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశించారు. అదే జిల్లాలోని అంకాపూర్‌ గ్రామంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల పరిశోధన, అభివృద్ధికి, మోతె గ్రామంలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు. త్వరలో నిజామాబాద్‌ జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. సచివాలయంలో గురువారం నిజామాబాద్‌ జిల్లాలో నీటిపారుదల, వ్యవసాయం, ఉద్యానవన అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలపై సిఎం సమీక్షించారు. నిజాంసాగర్‌ ఆయకట్టుకు సంబంధించి 38వేల ఎకరాలను స్థిరీకరించేందుకు గుత్ప ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దాదాపు రెండు టిఎంసిల నీటిని లిఫ్టు వేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టును మరింత విస్తరించాలని ఈ సమీక్షలో ముఖ్యమంత్రి చెప్పారు. జాక్రాన్‌పల్లి, వేల్పూర్‌ మండలాల వరకు కూడా నీటిని పంపేవిధంగా ప్రాజెక్టును పరిధిని పెంచాలని, ఇందుకు సంబంధించి వెంటనే సర్వే చేయాలని కోరారు. నిజామాబాద్‌ జిల్లాలోనే పోచారం ప్రాజెక్టును కూడా 4 – 5 టిఎంసి స్థాయికి పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం రెండు టిఎంసిలకు తక్కువగానే ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగం జరుగుతుందని, ఇది రైతుల అవసరాలు పెంచలేక పోతున్నదని సిఎం చెప్పారు. గ్రావిటి ద్వారానే ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే అవకాశం ఉన్నందు, జాక్రాన్‌పల్లి, వేల్పూర్‌ మండలాలకు సాగునీరు అందించడం కోసం వెంటనే విస్తరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులను ఏడాదిలోపు విస్తరించాలని వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ గ్రామంలో రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని, మెరుగైన సాగు పద్ధతులతో పాటు మార్కెటింగ్‌ చేసుకోవడంలో కూడా పరిణతి చెందారని చెప్పారు. అక్కడి రైతులకు ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందిస్తే అంకాపూర్‌ గ్రామం మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అంకాపూర్‌లో భూములకు భూసార పరీక్షలు నిర్వహించాలని, రైతులకు ఆధునిక పరికరాలు అందించాలని, డ్రిప్‌ ఇరిగేషన్‌, గ్రీన్‌హౌస్‌ కల్టివేషన్‌ వంటి వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తేవాలని సిఎం సూచించారు. అంకాపూర్‌ను రైతులందరూ ఆదర్శంగా తీసుకునే ఓ శిక్షణా కేంద్రం కావాలని చెప్పారు. వేల్పూర్‌ మండలం మోతె గ్రామంలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్నికల సమయంలో ఈ హామీని మోతె గ్రామస్తులకు ఇచ్చినట్లు కూడా గుర్తుచేశారు. మోతెతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో చాలా గ్రామాల్లో పసుపు పంట పండిస్తున్నారు. కాబట్టి పసుపుపంట అభివృద్ధి కోసం, మంచి దిగుబడులు రావడం కోసం, పసుపును శుద్ధిచేయడం కోసం అవసరమైన సంస్థలను జిల్లాలో స్థాపించాలని నిర్ణయించారు. కేంద్ర స్పైసెస్‌ బోర్డు సహకారంతో తెలంగాణాలో పసుపు అభివృద్ధి పథకాన్ని తీసుకురావాలని కూడా కేసీఆర్‌ చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలోని నేలలు, వాతావరణం పసుపు పంటకు చాలా అనుకూలమైందన్నారు. 1250 ఎకరాల విస్తీర్ణంలో ఈ పైలట్‌ ప్రాజెక్టును నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు పసుపు పంటసాగుకు కావలసిన సాంకేతిక నైపుణ్యం అందడంతో పాటు రైతులకు ఆర్థికంగా కూడా ఉపయోగకరంగా ఉంటుందని సిఎంచెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేవిధంగా కొత్త భవనాలు నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య, సిఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని వాటిని వెలికితీసి పరిశ్రమలు నెలకొల్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వెంటనే తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని కూడా సూచించారు. తెలంగాణలోని సహజ వనరులు, మానవ వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే విధంగా పారిశ్రామిక విధానం ఉండాలని చెప్పారు. సచివాలయంలో గురువారం పారిశ్రామిక విధానంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహదారు బివి.పాపారావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్‌.నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ కర్యాదర్శి ప్రదీప్‌చంద్ర, టిఎన్‌ఐఐసి ఎండి జయేష్‌రంజన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఖనిజాలు ఉన్నాయని చెప్పారు. వాటిని గుర్తించి వెలికితీసి ఉపయోగంలోకి తేవాలన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని ఖనిజాలు, గనులను నిర్లక్ష్యం చేశారన్నారు. వరంగల్‌-ఖమ్మం సరిహద్దులోని లక్షాయాబై వేల ఎకరాల్లో అపార ఖనిజ సంపద ఉంటే అది పనికిరానిదని సీమాంధ్ర పాలకులు దుష్ప్రచారం చేశారని చెప్పారు. కానీ అక్కడ ఇటీవలే స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 30వేల కోట్లతో స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిందని, బయ్యారం ఇనుస ఖనిజం చాలా ఉపయుక్తమని చెప్పిందని వెల్లడించారు. ఇలా తెలంగాణలో సహజ వనరులున్నాయన్నారు. లైఫ్‌ సైన్సెన్‌, ఐటి హార్డ్‌వేర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డిఫెన్స్‌, కాటన్‌, స్పిన్నింగ్‌, లెదర్‌, మైన్స్‌, మినరల్స్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ పాలిమర్‌, కెమికల్‌, జేమ్స్‌, పెరల్స్‌, జ్యూవెలర్స్‌, ఆటోమొబైల్స్‌ తదితర రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై సమీక్ష నిర్వహించారు.

చత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు సంబంధించి ఎంఓయు చేసుకోవాలని ముఖ్యమత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సచివాలంయలో గురువారం విద్యుత్‌ శాఖపై సమావేశం నిర్వహించారు. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌కె.జోషి, ట్రాన్స్‌కో ఎండి సయ్యద్‌రిజ్వీ, జాయింట్‌ ఎండి కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈఆర్పీ సూచించిన ధరల విధానాన్ని అనుసరించాలని, విద్యుత్‌ కొనుగోలు ఒప&ంపదాలు కచ్చితంగా ప్రభుత్వాలతోనే చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్‌ సరఫరా పరిస్థితులను కూడా తెలుసుకున్నారు. భారీ వరదల వల్ల జూరాలలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోకి నీరు వచ్చిన సంఘటనపై కూడా సమీక్ష నిర్వహించారు. సిఎం ఆదేశాల మేరకు తెలంగాణ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు జూరాలకు వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో సోలార్‌ రూఫ్‌ టాప్‌ నెట్‌ మీటరింగ్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.