ఆమెదో సుదీర్ఘ పోరాటం
స్పష్టమైన డిమాండు ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంపై ఆమె సాగిస్తున్న పోరాటం అది పాలకులకు ఆత్మహత్యలా కనిపించిందట. కోర్టు చీవాట్లతో ఆమె విడుదలైంది. మళ్ళీ అరెస్టయింది. ఆమే ఇరోమ్ చాన్ షర్మిల. ఆశయ సాధన కోసం 14 సంవత్సరాలుగా ఓ మహిళ చేస్తున్న పోరాటం అజరామరం. ఆమె దీక్ష, పట్టుదల, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమను అభినందించాల్సిందే. రోజుకో కొత్త సమస్యను తెరమీదికి తీసుకొచ్చి తమ పబ్బం గడుపుకొని ఆ తర్వాత విస్మరించే నాయకులున్న ప్రస్తుత సమాజంలో ఒక ఆశయం కోసం తన ప్రాణాలను సైతం లేక్కచేయకుండా సంవత్సరాలపాటు బృహత్తర పోరాటం కొనసాగిస్తున్న మహిళకు జనం జేజేలు పలకాల్సింది. దేశంలోని ప్రజల మనస్సును చూరగొంటూ ప్రపంచం దృష్టిని మణిపూర్‌వైపు మరల్చేలా ఉద్యమిస్తున్న ఆ మహిళే ఇరోమ్ షర్మిల. మణిపూర్ ఉక్కు మహిళ, శాంతి దూత, సామాజిక ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల 14ఏళ్ళుగా నిరాహార దీక్ష చేస్తోంది. నవంబర్, 2000 సంవత్సరంలో ఆమె దీక్ష ప్రారంభమంది. మణిపూర్‌లో అమల్లో ఉన్న ప్రత్యేకాధిరాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ)ను ఉపసంహరించాలంటూ ఆమె ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1972 మార్చి 14న జన్మించిన ఆమె సుదీర్ఘకాలంపాటు నిరాహార దీక్ష చేసిన మహిళగా రికార్డుల్లోకెక్కారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థపై తనకు నమ్మకం లేదని, తాను ఓటు హక్కును కూడా వినియోగించుకోనని ప్రకటిస్తూ దీక్ష కొనసాగించింది.
ఇరోమ్ షర్మిల ఆత్మహత్యానికి ప్రయత్నిస్తుందంటూ పోలీసులు పలు కేసులు నమోదు చేసి తాత్కాలిక జైలు (ప్రభుత్వాస్పత్రిలోని ఓ గది)లో బంధించారు. ఆమెను విడుదల చేయాలని తూర్పు ఇంపాల్‌లోని సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ బుధవారం విడుదల చేశారు. విడుదలైన అనంతరం కూడా ఆమె నిరాహార దీక్షను విరమించలేదు. ప్రత్యేకాధికారాల చట్టం రద్దుచేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటిస్తూ ఆస్పత్రి ప్రాంగణంలోనే దీక్ష కొనసాగించారు. దీంతో తిరిగి ఆమెను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రత్యేకాధికారాల చట్టం అమల్లో ఉన్న ప్రదేశాల్లో పౌరులు తమ ప్రాథమిక హక్కులు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. ఈ చట్టం అమల్లో ఉండే ప్రాంతాలను పూర్తిగా పోలీసులు, భారత పారా మిలటరీ దళాలు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థ మచ్చుకు కూడా కానరాదు. పైగా పారామిలటరీ బలగాలు అనేక దుశ్చర్యలకు పాల్పడిన సంఘటనలు గతంలో ఉన్నాయి. తీవ్రవాదులు అనే చిన్న అనుమానం వచ్చినా సాధారణ ప్రజలను చిత్రహింసలకు గురిచేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ చట్టం వల్ల తమ రాష్ట్రంలో ప్రజల హక్కులు హరించుకుపోతాయని, ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదని షర్మిల పోరాటం చేస్తోంది. మహిళ చేస్తున్న పోరాటంతో ప్రభుత్వం స్పందించాలి. ఈమె చేస్తున్న ఉద్యమంతో స్పందించిన వివిధ సంస్థలు ఎన్నో అవార్డులు ప్రకటించాయి. ఒక మహిళ ఎవరూ ఊహించని రీతిలో ఉద్యమిస్తుందంటూ ఆమెకు అవార్డులు, రివార్డులు ప్రకటిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆమె చేస్తున్న ఉద్యమానికి తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చాయి. తమ పార్టీ తరపున పోటీచేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ షర్మిలను ఆహ్వానించాయి. ఇందుకు ఆమె అంగీకరించకుండా ఉద్యమాన్ని కొనసాగించింది.
ఆమె చేస్తున్న పోరాటానికి ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలి. తీవ్రవాద హింస పేట్రేగిపోతుందన్న కారణంతో సామాన్యుల హక్కులను హరించేవిధంగా ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ)ను అమలుచేస్తూ పౌర హక్కులకు విఘాతం కలిగిస్తున్న ఈ చట్టంపై కనీసం ఎన్డీఎ ప్రభుత్వం స్పందించాలి. ఆమె పోరాటంపై దేశవ్యాప్తం చర్చ జరగాలి. ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసుకోబోతుందన్న ప్రభుత్వ కోణానికి పౌర సమాజం సిగ్గుపడాలి. ఇప్పటికైనా ప్రత్యేకాధికారాల చట్టంపై మోడీ సర్కారు మాట్లాడితే తుపాలకుల పాలన సాగుతున్న చోట పౌర హక్కుల గురించి మాట్లాడి ప్రజాస్వామిక సుహృద్భావ వాతావరణనాన్ని కలిగించినట్లవుతుంది.