పొన్నాలకు ఓటమి ఫోబియా : ఎంపీ వినోద్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) :
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు ఓటమి ఫోబియా చుట్టుకుందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. బుధవారం వినోద్ విూడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. వంద రోజుల పాలనలో రాష్ట్ర సమస్యలపై బ్లూ ప్రింట్ తయారుచేశామని, త్వరలోనే ఎన్నికల హావిూల అమలు కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. పొన్నాల లక్ష్మయ్య అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని వినోద్ ధ్వజమెత్తారు. వైఎస్ వంద రోజుల పాలనలో అభివృద్ధి గురించి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ కుమారుడు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లడం అభివృద్ధా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ పాలనలో ఎవరు అభివృద్ధి చెందారో సీబీఐ చెబుతుందన్నారు. వైఎస్ పాలనలో వంద రోజుల్లో పొన్నాల ఏం చేసిండో ప్రజలకు తెలుసని తెలిపారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది పొన్నాల కాదా? అని నిలదీశారు. ఇకనైనా పొన్నాల కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ది తుగ్లక్ పాలనో, హిట్లర్ పాలనలో మెదక్ ఉప ఎన్నిక తర్వాత తేలుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వంద రోజులే అయింది.. టీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందినంత వేగంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. మెదక్ ఉప ఎన్నికల తర్వాత ప్రజలు ఎటువైపు ఉంటారో తేలిపోతుందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని తెలిపారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సమైక్యవాది జగ్గారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన రోజే బీజేపీ ఓటమి ఖాయమై పోయిందన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కాపాడేది టీఆర్‌ఎస్సేనని మాజీ ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ ఇస్తామని మోసంచేసిన యూపీఏకు అమరవీరుల శాపం తగిలిందని చెప్పారు. తెలంగాణ అమరవీరుల ఉసురు తగిలినందునే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష ¬దా రాలేదని నిప్పులు చెరిగారు. తుగ్లక్, హిట్లర్ పాలన టీఆర్‌ఎస్‌ది కాదని.. కాంగ్రెస్ పదేళ్ల పాలనే తుగ్లక్ పాలన అని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో పొన్నాల ఎప్పుడైనా అమరుల కుటుంబాల వద్దకు ఎప్పుడైనా వెళ్లారా? అని ప్రశ్నించారు. అమరుల గురించి మాట్లాడుతున్న పొన్నాలకు మెదక్ ప్రజలు బుద్ధిచెెబుతారన్నారు. అవినీతిరహిత పాలన కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరని, వారంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని తెలిపారు.