బంగారు తెలంగాణ కోసం భూసార పరీక్షలు
ఇక్రిశాట్ సహకారం కోరిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనంసాక్షి) :
బంగారు తెలంగాణ కోసం భూసార పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇక్రిశాట్ సహకారం అందించాలని సీఎం కోరారు. ఈమేరకు శుక్రవారం ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ విలియం డి.దార్, గ్లోబల్ లీడర్ దిలీప్‌కుమార్, డైరెక్టర్ సుహాస్ పి.వాణి సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణను ధాన్యాగారంగా మార్చడమే తన ఉద్దేశమన్నారు. ఏడాదిలోగా కోటి ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన సమగ్ర వివరాలతో తెలంగాణ భూసార పటం రూపొందించాలని సంకల్పించినట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫేస్టోలో కూడా భూసార పరీక్షలు నిర్వహిస్తామని హామీనిచ్చామని, ఆ హామీని నిలబెట్టుకుని రైతులకు అండగా ఉంటామని సీఎం ప్రకటించారు. తెలంగాణలో అనేక కరాల నేలలు ఉన్నాయని, ఆ నేలలు ఏ పంటకు అనువైనవి? ఆ భూమిలో ఏ పోషక విలువలు ఉన్నాయి? ఆ నేలలో ఏ రకమైన పంట వేస్తే రైతుకు ఉపయోగం ? తదితర అన్ని వివరాలు సేకరించి రైతులకు సాయిర్ హెల్త్ కార్డులు కూడా అందించాలన్నది తన లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు. ఇక్రిశాట్ సహకారంతో తెలంగాణ భూసార పటం (తెలంగాణ సాయిల్ ఫర్టిలిటీ అట్లాస్) రూపకల్పనకు ఆయన నిర్ణయించారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చే ఆలోచన తనకు ఉందని ఇక్రిశాట్ ప్రతినిధులకు చెప్పారు. దేశవ్యాప్తంగా రెండవ హరిత విప్లవానికి అడుగులు పడుతున్న క్రమంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ ప్రాంత రైతులకు ఉపయోగపడే వ్యవసాయ విధానం అవలంబించడం తన ఉద్దేశమని చెప్పారు. తెలంగాణలో వివిధ రకాల నేలలు ఉన్నాయని, అయితే రైతులు అన్ని రకాల నేలల్లో ఒకే రంక పంటు పండిస్తున్నారని, దీనివల్ల ఆశించిన దిగుబడులు రావడంలేదని సీఎం చెప్పారు. అందుకే కర్ణాటక రాష్ట్రం తరహాలో తెలంగాణ భూసార పటాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇక్రిశాట్ ఆధ్వర్యంలోనే కర్ణాటక భూసార పరీక్షలు జరిగాయని, వారి అనుభవాన్ని, విజ్ఞానాన్ని తెలంగాణకు కూడా వినియోగించుకుంటామని చెప్పారు. భూసార పరీక్షలు నిర్వహించే పద్ధతులను కూడా ముఖ్యమంత్రి ఇక్రిశాట్ అధికారులను అడిగారు. తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించాల్సిన పద్ధతులపై కూడా ప్రాథమికంగా చర్చలు జరిపారు. తెలంగాణ నేలలన్నింటిలో ఒకే రకమైన లక్షణాలు లేవని, నైట్రోజన్, పాస్పరస్, జింక్, సల్ఫర్, బోరాన్ లాంటి పోషక పదార్థాల నిష్పత్తిలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయని సీఎం చెప్పారు. భూసార పరీక్షలు నిర్వహించడం వల్ల ఏ నేలలో ఏ పోషకం తక్కువున్నదో తెలుస్తుందని, దానివల్ల ఆ భూముల్లో ఆ పోషకం పెంచడానికి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని భూసారాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. ఇలా చేయడం వల్ల దిగుబడులు కూడా పెరుగుతాయని అన్నారు. మొత్తం తెలంగాణవ్యాప్తంగా భూసార పటం తయారుచేసుకోవడం వల్ల క్రాప్ కాలనీల విభజన, నిర్వహణ కూడా సులభం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భూసారాన్ని గుర్తించడానికి భూసార పరీక్షలకు మించిన మార్గంలేదని కూడా చెప్పారు. భూసార పరీక్షలు నిర్వహించకున్న తర్వాత పంటలను ఎంచుకుని సాగుచేయడం వల్ల కర్ణాటకలో రైతులు దిగుబడిని 32శాతం నుంచి 66 శాతం వరకు పెంచుకోగలిగారని, దీన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో కూడా భూసార పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేలల్లో కూడా వ్యవసాయం చేయవచ్చని, అక్కడి భూముల్లో కూడా ఏలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుని పంటలను ఎంపిక చేసుకోవడం వీలవుతందని చెప్పారు. భూసార పటాన్ని రూపొందించుకున్న తర్వాత ఆ సమాచారం అందరికీ అందుబాటులో పెడతామని, ప్రతి రైతుకు తన నేల స్వభావం ఏమిటో స్పష్టంగా తెలిపేందుకు సాయిల్ హెల్త్‌కార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇది సాంప్రదాయ వ్యవసాయం చేసే రైతులకే కాకుండా కూరగాయలు, పండ్లతోటలు, పూలమొక్కలు, ఔషధ మొక్కలు పెంచేవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ముందే భూసార పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ఆ నేలల్లో పండించే పంటలకు ఏలాంటి తెగుల్ళు వస్తాయో కూడా ఓ అంచనాకు రావచ్చని దీనివల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవడం తేలిక అవుతుందని సీఎం చెప్పారు. అన్నివిధాల భూసార పరీక్షలు అత్యంత అవసరం కాబట్టి వీలైనంత తొందరగా ఈ కార్యక్రమం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. భూసార పటం రైతులకే కాకుండా ప్రభుత్వానికి, వ్యవసాయ పరిశోధకులకు, వ్యవసాయ అధికారులకు, సంప్రదాయ ఎరువుల ఉత్పత్తిదారులకు, చివరికి వ్యవసాయ విధానాన్ని ఖరారు చేసే శాసన కర్తలకు కూడా కరదీపికలా పనిచేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.