త్వరలో నూతన పంచాయతీరాజ్‌ చట్టం

4

నవంబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్‌ విధానం

బయోమెట్రిక్‌ విధానం.. అవినీతిరహిత పాలన

మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) :

త్వరలో కొత్త పంచాయితీ రాజ్‌ విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తెస్తున్నట్టు పంచాయితీరాజ్‌, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నవంబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్‌ విధానం ప్రవేశపెడుతున్నామన్నారు. బయోమెట్రిక్‌ విధానంతో అవినీతిరహిత పాలన అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వంద రోజుల్లో పంచాయితీరాజ్‌శాఖ అభివృద్ధికి సంబంధించిన పుస్తకం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లోగోను శనివారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఎన్నికల సందర్భంగా సీఎం ఇచ్చిన హామీల్లోని కొత్త పెన్షన్‌ విధానాన్ని నవంబర్‌ 1 నుంచి అమలులోకి తెస్తున్నట్లు చెప్పారు.వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్‌ అందజేయనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1192 గిరిజన తండాలు, గూడెంలను పంచాయితీలుగా గుర్తించడం జరిగిందని, వీటితోపాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రోడ్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్ననీటి పారుదల వ్యవస్థ పునరుద్ధరణకు రూ.1000కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.  ప్రభుత్వం అందించే పెన్షన్లు లబ్ధిదారులకు చేరేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. 2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు రూ.20వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. నల్గొండ జిల్లాలో క్ల్లోరిన్‌ సమస్య అధికంగా ఉన్నందున ఈ జిల్లాలోనే సిఎం చేతులమీదుగా వాటర్‌గ్రిడ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో కోటీ 5లక్షల కుటుంబాలు ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో ఇప్పటి వరకు 96లక్షల కుటుంబాల వివరాలు కంప్యూటర్‌లో పొందుపరిచామని చెప్పారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పథకం ద్వారా రాష్ట్రంలో ధాన్యం నిల్వంకోసం 500గోదాములను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇదే పథకం ద్వారా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, వాటి సంరక్షణ కోసం ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పంచాయితీరాజ్‌శాఖ ద్వారా 124 కోట్ల మొక్కలు అటవీశాఖ ద్వారా, 110కోట్ల మొక్కలు మొత్తం 234 కోట్ల మొక్కలను నాటనున్నట్లు  చెప్పారు. రాబోయే నాలుగేళ్ళల్లో ప్రతి గ్రామ పంచాయితీని బ్రాడ్‌బాండ్‌ ద్వారా అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కొత్త పంచాయితీ విధానంతోపాటు స్థానిక సంస్థలకు అధికారాలు కల్పిస్తామని చెప్పారు. అధికారాలు అడిగే సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వెనకబడిన, ఎస్సీ, ఎస్టీల జీవనోపాధిని పెంపొందించడానికి ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పథకం ద్వారా పనులు కల్పించడానికి ప్రపంచ బ్యాంకు రూ.650కోట్లు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం అమలు, అభిప్రాయాలు తెలపడం కోసం హెల్ప్‌లైన్‌ నెం.18002001001ను ఏర్పాటుచేసినట్టు మంత్రి వివరించారు.