9 నుంచి ఇంటర్‌ పరీక్షలు

9

హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): తెలంగాణలో తొలి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి అన్నిజిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇవ్వమని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చి, ఉదయం 8.45 నిమిషాలకు తమకు కేటాయించిన గదుల్లో కూర్చోవాలన్నారు. 8.45 గంటల నుంచి 9 గంటల మధ్య వచ్చే విద్యార్థులపై నిఘా ఉంటుందని, ఇప్పటికే హాల్‌టికెట్ల పంపిణీ చేపట్టామని అన్నారు.  60 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే హాల్‌టిక్కెట్లు ఇస్తున్నారు. అంత కంటే తక్కువ ఉంటే నిరాకరించడంతో పలువురు విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. కొత్తరాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్నప్పటికీ పరీక్ష విధానం పాత పద్ధతిలోనే ఉంటుంది. అయితే గతంలో ప్రశ్నపత్రాలు 1, 2, 3 సెట్లుగా ఉండేవి.. ఇప్పుడు ఎ, బి, సిగా మార్చారు. దీనిపై పరీక్ష నిర్వహణాధికారులకు వివరించారు.  పాత, కొత్త ప్రశ్న పత్రాల పంపిణీలో గందరగోళం చోటు చేసుకోకుండా డీవోలకు స్పష్టమైన అవగాహన కల్పించాంరు.  విద్యార్థులూ అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావు. ఆర్ట్స్‌ విభాగం ప్రథమ సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులకు కొత్త సిలబస్‌ ప్రశ్నపత్రం, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాతవి ఇవ్వాలి. సైన్స్‌ విద్యార్థులందరికీ ఒకటే ప్రశ్నపత్రం. ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్‌ విద్యార్థులు ద్వితీయ భాష కొత్తవి, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాతవి ఇవ్వాలి. మిగతా స్జబెక్టులకు ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. విద్యార్థులకు ప్రశ్న పత్రం ఇవ్వగానే దానిపై ‘ఓ’ అనే ఆంగ్ల అక్షరం ఉంటే పాతవని, ‘ఎన్‌’ అనే ఆంగ్ల అక్షరం ఉంటే కొత్తవని గుర్తించాలి. ఒకదానికి మరొకటి వస్తే విద్యార్థులు వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.  చూసిరాతలకు ప్రయత్నిస్తే మిగతా పరీక్షలు రాసే అవకాశం కోల్పోతామనే విషయాన్ని విద్యార్థులు గుర్తించుకోవాలి.  కాపీయింగ్‌కు ఇన్విజిలేటర్లు సహకరిస్తే వారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.  పరీక్ష కేంద్రంలో సీఎస్‌, డీవోలకు మాత్రమే సెల్‌ఫోన్‌  వినియోగించే అవకాశం ఉంటుంది. ఏవైనా ఇబ్బందులు వచ్చినా, ప్రశ్నపత్రాల్లో తప్పులు చోటు చేసుకున్నా సమాచారం అందించేందుకు మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో వినియోగించే సెల్‌ఫోను, ఇంటర్నెట్‌ వివరాలు జీపీఎస్‌ ద్వారా నమోదవుతాయి కాబట్టి సాంకేతికత సహాయంతో అక్రమాలు చేసేవారి గుట్టురట్టవడం ఖాయం. ఇన్విజిలేటర్లు ఫోను తీసుకెళ్లడం నిషేధించారు. పరీక్ష కేంద్రాలను పెంచడం ద్వారా ఈసారి నేలపై కూర్చొని పరీక్ష రాసే పరిస్థితి లేకుండా చేశారు.  ఒక్కో కేంద్రంలో 550 మంది మాత్రమే పరీక్షలు రాస్తారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్‌లకు సూచించారు.  వేసవి కావడంతో మంచినీరు, వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచారు.  విద్యార్థుల రవాణాకు వీలుగా ఆయా కేంద్రాలకు బస్సులు నడపాలని ఆర్టీసీకి లేఖలు రాసి ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటుతో పాటు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

స్పాట్‌ వాటల్యువేషన్‌ కేంద్రాల్లో సిసి కెమరాలు

స్పాట్‌ వాల్యువేషన్‌ కేంద్రాల్లో  సీసీ కెమెరాలను అమర్చి శిబిరంలో పనిచేసే అధికారులు, సిబ్బంది రాకపోకలపై నిఘా పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌ పరీక్షలు ప్రారంభానికి ముందే  మూల్యాంకనంపై ఇంటర్‌ బోర్డు దృష్టి సారించింది. ఎగ్జామినర్‌ల అలసత్వంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. అనుకున్న మార్కులు పొందని విద్యార్థులు పునః మూల్యాంకనం, పునర్‌ గణనం కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. అత్యధికులకు మార్కులు పెరుగుతున్నాయి. దీంతో ఇంటర్‌ బోర్డు మూల్యాంకన శిబిరంలో కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. అందుకే రాష్ట్రంలోని అన్ని జిల్లాల మూల్యాంకన శిబిరంలో సీసీ కెమెరాలను బిగించింది. ఎగ్జామినర్లు సమయ పాలన పాటించకపోవడం అనేక సమస్యలకు కారణంగా గుర్తించారు. ఆలస్యంగా వచ్చి ఆదరబాదరగా మూల్యాంకనం చేయడంతో తప్పులు దొర్లుతున్నాయని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎందరో విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పక్కాగా ఏర్నాట్లు చేస్తున్నారు. ఇంటర్‌ పరీక్షలు సవిూపిస్తుంటే కొన్ని కేంద్రాల్లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విద్యార్థులు కింద కూర్చోని పరీక్ష రాయకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పలుచోట్ల గదులు, ఫర్నీచర్‌ కొరత ఉండగా, మరికొన్ని కేంద్రాలు శిథిలావస్థలో ఉన్న గదులు, పగిలిన రేకుల షెడ్లు, చీకటి గదులతో విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి కేంద్రాలను గుర్తించి అధికారులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.