91 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమం
డీఎఫ్‌వో మహమ్మద్ తయ్యబ్
శ్రీకాకుళం, జూలై 19 : జిల్లాలోని అటవీ భూముల్లో ఈ ఏడాది 91 హెక్టార్లలో టేకు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి మహమ్మద్ తయ్యబ్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకొండ రేంజ్ పరిధిలో 20 హెక్టార్లు, పాతపట్నం రేంజ్‌లో 20 హెక్టార్లు, శ్రీకాకుళం పరిధిలో 10 హెక్టార్లు, కాశీబుగ్గ రేంజ్ పరిధిలో 41 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొంతమేర పూర్తయిందన్నారు. వర్షాలు పడితే మిగిలిన వాటిని నాటుతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్రమంగా కలప తరలిస్తున్న వారి నుంచి 9 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరం అక్రమార్కుల నుంచి రూ. 26 లక్షలు వసూలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సీతంపేట గిరిజన ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల సంరక్షణ, వాటి బారినపడి పంట నష్టపోయే రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఎలిఫెంట్ ప్రాజెక్టు పథకం అమలు కోసం రూ. 10 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. ఈ నిధులు మంజూరైతే ఎలిఫెంట్ ట్రాకర్స్‌కు వేతనాలు, ఏనుగులు సంచరించే కొండప్రాంతాల్లో వీటి కుంటలు, ఏనుగుల బారిన పడే గ్రామాల ప్రజలకు టపాసుల పంపిణీకి వినియోగించనున్నట్లు చెప్పారు. గత ఏడాది ఇదే పథకం ద్వారా రూ. 50 లక్షలకు ప్రతిపాదనలు పంపగా రూ. 2.50 లక్షలు మంజూరైనట్లు ఆయన చెప్పారు.