99 ప్రాజెక్టుల భారీ ఒప్పందం
– కేంద్రమంత్రులతో వరుస భేటీలు
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 6(జనంసాక్షి):దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు మూడు దశల్లో పూర్తీ చేయనున్నారు. తొలిదశ 2016-2017లో 23 ప్రాజెక్టులు, రెండోదశ 2017-201లో 31 ప్రాజెక్టులు, మూడో దశ డిసెంబర్‌లోపు 45 ప్రాజెక్టులు పూర్తీచేసేందకు ప్రణాళికను కేంద్ర సిద్ధం చేసిందని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.ఆయన మంగళవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు ఉమాభారతి, గడ్కరీ, రాధామోహన్, నిర్మలా సీతారామన్‌లతో సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులు, మార్కెటింగ్, వ్యవసాయ, పరిశ్రమల శాఖలకు చెందిన పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. వాటికి సంబంధించిన వినతి పత్రాలను ఆయా మంత్రులకు సమర్పించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి వాడకంపై ఎపీ నివేదికలకు, వాస్తవానికి పొంతన కుదరడం లేదని కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతికి మంత్రి తెలపారు. ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పక్కాగా తేలవలసి ఉందన్నారు. టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేసేంత వరకు కృష్ణా ప్రాజెక్టుల దగ్గర ఎపి, తెలంగాణ అధికారులతో కూడిన సంయుక్త అజమాయిషీ కమిటీని నియమించాలని మంత్రి హరీశ్ కోరారు. ప్రాజక్టుల వారీగా కృష్ణాలో నీటివాటాను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఖరారు చేయవలసి ఉందన్నారు. గత రెండేళ్లుగా తాత్కాలిక వర్కింగ్ ఎరేంజ్ మెంట్ ప్రకారమే పంపకాలు
జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. త్వరలో ఢిల్లీలో కేంద్రం తలపెట్టిన ఇద్దరు సీఎంల భేటీలో చర్చించవలసిన అంశాలపై ఉమాభారతికి హరీశ్ రావు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు, కృష్ణా, గోదావరిలతో తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటా, పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టులనుంచి ఎపి అడ్డగోలు నీటివాడకం, కెఆర్‌ఎండీ సమర్ధంగా పనిచేయకపోవడం వంటి అంశాలపై అపెక్స్ బాడీలో చర్చించాలని మంత్రి హరీశ్ కేంద్రాన్ని కోరారు. తెలంగాణలోని దేవాదుల సహా 11 ఆన్‌గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం కరుణించింది. ఈ ప్రాజె క్టులకు 7 వేల కోట్ల నాబార్డు రుణ సహాయానికి సంబంధించి ఢిల్లీలో మంగళవారం ఎంవోయూ కుదిరింది. కేంద్ర ప్రభుత్వం సహకారం పట్ల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టుల పూర్తికి తీవ్ర జాప్యం ఏర్పడుతోందని మంత్రి అన్నారు. కేంద్రం రాష్ట్రాలకు నాబార్డుతో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అంగీకారాన్ని తెలియజేయడం శుభసూచకమని అన్నారు. అంతేగాకుండా ప్రాజక్టులను పూర్తి చేసిన తర్వాత కాలువల నిర్మాణానికి సాగుకు నీళ్లందించే లక్ష్యాన్ని చేరేంద వరకు నిధుల మద్ధతుకు సహకరించడం కేటాయింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవడాన్ని చారిత్రాత్మకమైన నిర్ణయంగారాష్ట్ర ప్రభుత్వాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. రాష్ట్రాలు తిరిగి 15 సంవత్సరాలలోపు రుణాలను చెల్లించాల్సిం ఉంటుంది. ఈ ప్రణాళికలో తెలంగాణ నుంచి 11 ప్రధాన ప్రాజెక్టులకు దాదాపు ఏడువేల కోట్ల సహాయం లభిస్తుంది.