ఆర్మూర్ డివిజన్ గ్రామాభివృద్ధి కమిటీలపై చర్యలు తీసుకోవాలి

బోధన్, (జనంసాక్షి) : ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో కొనసాగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాలని మంగళవారం బోధన్ మండల తహశీల్దార్ విఠల్ కు సిపిఎం పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి జె శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ఏర్గట్ల మండలం తాల్లరాంపూర్ గ్రామంలో నివసిస్తున్న కలుగీత కార్మికులపై విడీసీలు దౌర్జన్యం చేస్తూ వారి కుటుంబాలను వెలివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీరామనవమి రోజు గౌడ మహిళలను గుడి నుండి వెళ్లిపోవాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీస్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో చేతి వృత్తిదారులపై డబ్బులు డిమాండ్ చేస్తూ వీడీసీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటువంటి దుర్మార్గులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే కాలంలో ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసి గోపి, ప్రభాస్, కాశీనాథ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.