Amnesia Pub Case: ప్లాన్‌ ప్రకారమే ఆ వాహనం వినియోగించారు.. కానీ..

జూబ్లీహిల్స్‌లో విదేశీబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్ల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ నెల 9న వీరిని నాలుగు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించిన విషయం తెలిసిందే. అంతకుముందే ఏ1 నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ను కస్టడీకి తీసుకోగా సోమవారమే ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత నాలుగు రోజులుగా బంజారాహిల్స్‌ ఏసీపీ ఎం.సుదర్శన్‌ కస్టడీలో ఉన్న మైనర్లను వేర్వేరుగా, ఒకేచోట కూర్చోబెట్టి విచారించారు. అత్యాచారం ఎక్కడ జరిగింది, ఇందుకు ఉసిగొల్పింది ఎవరు అనే విషయాలపై ఆరా తీయగా, జూబ్లీహిల్స్‌లోని ఓ గుడి వెనుకాల నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం జరిపినట్లు చెప్పారు.

ఒకేచోట అందరం కలిసి అత్యాచారానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కొడుకుతోపాటు వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కొడుకు, సంగారెడ్డి మున్సిపాలిటీ కో–ఆప్షన్‌ మెంబర్‌ కొడుకు ఉండగా ఆ రోజు అధికారిక వాహనాన్ని ఎవరు తీసుకు రమ్మన్నారని పోలీసులు ప్రశ్నించారు. ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న ఇన్నోవా కారును పథకం ప్రకారమే తీసుకొచ్చామని, ఈ కారుకు బ్లాక్‌ ఫిలింఉండటమే కాకుండా గవర్నమెంట్‌ వెహికిల్‌ అని ఉంటే ఎవరూ టచ్‌ చేయరన్న ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు.

ముందస్తు పథకంలో భాగంగానే కండోమ్‌ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చినట్లు విచారణలో చెప్పారు. ఫోరెన్సిక్‌ విభాగం అధికారులు కారును తనిఖీ చేసినప్పుడు కండోమ్‌లు దొరికిన విషయం తెలిసిందే. కస్టడీలో భాగంగా ఆదివారం మైనర్లందరినీ సీన్‌ ఆఫ్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లారు. పోలీసు కస్టడీలో మైనర్లందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే సమాధానం చెప్పారు. పోలీసు కస్టడీ ముగియగానే మంగళవారం సాయంత్రం ఈ ఐదుగురు మైనర్లను జువనైల్‌ హోంకు తరలించారు.

 

ఈ ఘటనలో మైనర్లు నడిపిన కార్లకు సంబంధించి కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్‌లో నివసించే ఓ ఎమ్మెల్యే కుమార్తెకు చెందిన బెంజ్‌ కారును ఆమె కుమారుడు నడిపాడు. అలాగే ఇన్నోవా డ్రైవర్ని బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్ద దించి ఆ వాహనాన్ని మరో మైనర్‌ నడిపాడు. ఈ ఉదంతాల్లో మైనర్లతో పాటు వారికి వాహనాలిచ్చిన వారిపైనా కేసులు నమోదు చేయనున్నారు.