విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి
కరెంట్ తీగలు తగిలి యువకుడు దుర్మరణం!
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..
చండూరు, జూన్ 4 (జనంసాక్షి)నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలియైంది. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడంలో అధికారులు చూపిస్తున్న ఉదాసీనత వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇటువంటి ఘోర ప్రమాదమే చండూరు మండల పరిధిలోని చొప్పరి వారి గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్న ఒక యువకుడు కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పరి వారి గూడెం గ్రామానికి చెందిన చొప్పరి చందు (20) అనే యువకుడు తన పొలం వద్దకు వెళ్తుండగా, మార్గమధ్యంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు అతనికి తగిలాయి. కరెంట్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చందు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.వ్యవసాయ బావుల వద్ద గత కొన్ని రోజులుగా విద్యుత్ తీగలు చేతికి అందేంత తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు ఎంతమాత్రం పట్టించుకోలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే చందు ప్రాణాలు కోల్పోయాడని, ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.చేతికంది వచ్చిన కొడుకు కళ్ల ముందే కరెంట్ షాక్‌తో చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బాధితుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.



