అరైవ్ అలైవ్ – మీ కుటుంబం మీ కోసం వేచి ఉంది

వేగం కాదు… జీవితం ముఖ్యం
మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్
హయత్ నగర్, జూన్ 10 (జనం సాక్షి) హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్ – మీ కుటుంబం మీ కోసం వేచి ఉంది” రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమానికి మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్, ఎల్‌బీ నగర్ డీసీపీ బి. అనూరాధ ఐపీస్, మాజీ హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, మాజీ జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి బి సుమతి మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో వాహనాల వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది. అదే సమయంలో రోడ్డు ప్రమాదాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతి రోజు అనేక కుటుంబాలు తమ ప్రియమైన వారిని రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నాయి. కొందరు జీవితాంతం వికలాంగులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో “అరైవ్ అలైవ్ – మీ కుటుంబం మీ కోసం వేచి ఉంది” అనే సందేశం ప్రతి వాహనదారుడికి ఒక హెచ్చరిక మాత్రమే కాదు, జీవితం పట్ల బాధ్యతను గుర్తు చేసే పిలుపు అని అన్నారు. యువతలో బైక్ రేసులు, స్టంట్లు, సెల్ఫీల మోజు పెరుగుతోంది. సోషల్ మీడియా కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ప్రమాదకరం అని యువతను హెచ్చరించి, వారికి సందేశాన్ని ఇచ్చారు.ఎల్‌బీ నగర్ డీసీపీ బి. అనూరాధ మాట్లాడుతూ సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణ రక్షణలో రహదారి భద్రత అత్యంత కీలకమని, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రజల్లో రహదారి భద్రతపై మరింత చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతోట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – సురక్షితంగా గమ్యానికి చేరుదాం, గమ్యానికి చేరుకోండి – మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత అని తెలియజేశారు.చాలా మంది వేగంగా వెళ్లడం ద్వారా సమయాన్ని ఆదా చేస్తున్నామని భావిస్తారు. కానీ ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూరోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి రోడ్డు వినియోగదారుడి బాధ్యత అని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగించడం, అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కొప్పుల నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోడ్డు ప్రమాదం వెనుక ఒక కుటుంబం బాధ దాగి ఉంటుందని, చిన్న అజాగ్రత్త కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ “ప్రాణాలతో గమ్యానికి చేరుకోండి – మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది” అనే సందేశాన్ని జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులతో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా. లక్ష్మీ ప్రసన్న, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ కాశీ రెడ్డి, హయత్‌నగర్ సీఐ నాగరాజు, టీ జి ఎస్ ఆర్ టి సి హయత్‌నగర్ డీఎం విజయ్, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది, తదితరులు హాజరయ్యారు.



