దళిత ఉప సర్పంచ్‌పై దాడి

సుద్దులం సర్పంచ్ హేమలత,ఆమె భర్తపై పోలీసుకు ఫిర్యాదు
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాల డిమాండ్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 17: జనం సాక్షి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామ సర్పంచ్ తీనేటీ హేమలత, ఆమె భర్త లక్ష్మణ్ రెడ్డిపై ఉప సర్పంచ్ చెవిటి నరేష్ డిచ్‌పల్లి పోలీసులకు, నిజామాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల బుధవారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో హైమాక్స్ లైట్లకు సంబంధించిన రూ.60 వేల బిల్లుపై సంతకం చేయాలని సర్పంచ్ భర్త లక్ష్మణ్ రెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు. బిల్లుపై పాలకవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పగా, తనను దుర్భాషలాడుతూ బిల్లు, చెక్కుపై వెంటనే సంతకం చేయాలని బెదిరించారని తెలిపారు. సంతకం చేయకపోతే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడానికి ప్రయత్నించగా సర్పంచ్ హేమలత తనపై దాడి చేశారని నరేష్ ఆరోపించారు. తాను ఉప సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి దళితుడినైన తనను కులం పేరుతో అవమానిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, ఆమె భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు డిచ్‌పల్లి ఎస్సై ఆరీఫ్ శుక్రవారం సుద్దులం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. పలువురి వాంగ్మూలాలు నమోదు చేసి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.
**దళిత సంఘాల ధర్నా**
ఈ ఘటనపై దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఉప సర్పంచ్ చెవిటి నరేష్‌ను కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడడం ఖండనీయమని పేర్కొన్నారు. శుక్రవారం సుద్దులం గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి, సర్పంచ్ హేమలత, ఆమె భర్త లక్ష్మణ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం, పోలీసులు ఉపేక్షించరాదని, బాధితుడికి తక్షణ న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాలకు చెందిన దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



