నిరుద్యోగంపై సమరభేరి

కార్పొరేట్లపై 2% పన్ను వేస్తే ఉచిత విద్య, వైద్యం: సీపీఎం

మహబూబ్ నగర్ బ్యూరో ఆగస్టు 12(జనం సాక్షి ): దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలపై కేవలం 2 శాతం అదనపు పన్ను విధిస్తే, దేశంలో ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించవచ్చని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి, కేవలం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తోందని విమర్శించారు. బడా వ్యాపారవేత్తల అనుకూల విధానాల వల్ల అనేక విదేశీ వేదికలపై భారతదేశం రాజీ పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, రాజ్యాంగ విరుద్ధమైన ‘సర్’ పేరుతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని హరిస్తోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈనెల 14న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రేషన్ కార్డుదారులకు అదనపు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 15న సంగారెడ్డిలో నిర్వహించే సభలో కేవలం స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా లేక ప్రజలకు ఏమైనా అదనపు సౌకర్యాలు కల్పిస్తారా అని ప్రశ్నించారు. పేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై సీపీఎం ఆధ్వర్యంలో సమరశంఖం పూరిస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ నిరసనలు, అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 31న అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

తాజావార్తలు