ప్రయివేట్ పాఠశాల డైరెక్టర్ రూపారెడ్డి దారుణ హత్య

కొండమల్లేపల్లి, ఆగస్టు 12 (జనంసాక్షి): కొడమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని జేబీ కాలనీలో నివాసం ఉంటున్న రూప రెడ్డి (51)ని రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రూపారెడ్డి తలపై బలమైన వస్తువులతో కొట్టడంతో తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్ లోఉన్న ఆమె భర్త ఫోన్ చేయగా రూప ఎంతకు స్పందించకపోవడంతో ఇంట్లో అద్దెకు ఉంటున్న వాళ్లకు కాల్ చేశారు. వారు వెళ్లి చూడగా రూపరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న డిఎస్పి శ్రీనివాస్ రావు, సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ అజ్మీరా రమేష్ పోలీస్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపా రెడ్డి గత 28 సంవత్సరాలుగా నాగార్జున పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నరు. ఆకస్మాత్తుగా రూపారెడ్డి దుండగుల చేతులో దారుణ హత్యకు గురి కావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు. రూప రెడ్డి దారుణ హత్యకు గల కారణాలను పోలీసులు తీవ్రంగా శోధిస్తున్నారు. దుండగులు ఏ స్థాయిలో ఉన్న పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామన్నారు.



