భూపాలపల్లి స్మార్ట్ పాయింట్ పై కేసు నమోదు
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ శివారులో గల రిలయన్స్ కంపెనీకి చెందిన స్మార్ట్ పాయింట్ పై వరంగల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ కోర్టులో కేసు నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ కు చెందిన తడుక సుధాకర్ అనే కొనుగోలుదారుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ లో గల రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో గత ఫిబ్రవరి నెలలో సరుకులు కొనుగోలు చేయగా, వస్తువుల బిల్లులో అదనంగా రూ.1285లు వేయడాన్ని గుర్తించడం జరిగింది. ఈ విషయమై స్మార్ట్ పాయింట్ మేనేజర్ ను, సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. వెంటనే వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ సిరంగి గోవర్ధన్ ను ఫిర్యాదు చేయగా, స్మార్ట్ పాయింట్ కు వచ్చి తనిఖీ చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బిల్లులో ఉన్న రైస్ బ్యాగ్ కొనుగోలు దారునికి అప్పగించినట్లుగా లేదు. దీనిపై కొనుగోలుదారుడు అడ్వకేట్ చిర్ర రాధాకృష్ణ ను సంప్రదించి వరంగల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ కోర్టులో కేసు వేయడం జరిగింది. అడ్వకేట్ చిర్ర రాధాకృష్ణ కొనుగోలు దారుని తరుపున వాదనలు వినిపించగా వాదనలు విన్న వినియోగదారుల ఫోరం కోర్టు చైర్మన్ సిసి నం. 51/25 నంబర్ గా కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి వాదన గురించి వచ్చే నెల 16 తేదీకి వాయిదా వేశారు.