రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని సూచించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా రైతులకు ఈ చెల్లింపులు చేయాలని అధికారులను కోరారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు ఖరారు కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి గతంలో ఉన్న రైతుబంధు పథకం లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు.
కాగా తెలంగాణ ఎన్నికలకు ముందే రైతు బంధు సాయం రైతులకు అందాల్సి ఉంది. కానీ అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైతుబంధు పథకం అమలును ఈసీ నిలిపివేసింది. తర్వాత అనుమతి ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి చేసిన కామెంట్ల కారణంగా ఈసీ రైతుబంధును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సాయం అందిస్తామని రేవంత్ మాట ఇవ్వడంతో తాజాగా ఆయన ఆదేశాలు జారీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.