రూ.600 కోట్లతో జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం

 

 

 

 

 

జడ్చర్లకు ట్రాఫిక్, రూరల్ పోలీస్ స్టేషన్లు కావాలి

డీజీపీ శివధర్ రెడ్డి కి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి

ప్రజలందర్నీ కాపాడుకోవడానికి రూల్స్ పాటించాలా?

లేక మరోసారి ఎమ్మెల్యే కావడానికి రూల్స్ పక్కన పెట్టాలా?

ఆలోచించాలని ప్రజలను కోరిన ఎమ్మెల్యే

 

 

జడ్చర్ల, ఏప్రిల్ 17 (జనంసాక్షి): ఎమ్మెల్యేగా ప్రజలందరినీ కాపాడుకోవడానికి రూల్స్ ఫాలో కావాలా? లేకపోతే మరో సారి ఎమ్మెల్యే కావడానికి రూల్స్ పక్కన పెట్టి మీరందరూ చెప్పేది వినాలా? అనే విషయం గురించి ఒక్కసారి ఆలోచించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రజలను సూటిగా ప్రశ్నించారు. జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి రూ.600 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం త్వరలోనే జరగనుందని వెల్లడించారు. జడ్చర్లకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్లను కూడా మంజూరు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ని కోరారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం జడ్చర్ల పట్టణంలోని చంద్రా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను గురించి తనకు అనేక మంది నుంచి ఫోన్లు వస్తుంటాయని చెప్పారు. తమ బంధువు తాగి వాహనం డ్రైవ్ చేస్తూ, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, అయితే పోస్ట్ మార్టం నివేదికలో అతను తాగలేదని రిపోర్టు రాయిస్తారా? అని కొంత మంది అడుగుతుంటారని తెలిపారు. అలాగే ఆటోలో ఓవర్ లోడ్ తో వెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకుంటే వారికి ఫైన్ వేయకుండా విడిపించమని కొందరు అడుగుతుంటారని, నలుగురు కూర్చోవాల్సిన ఆటోలో 14 మంది కూర్చొంటే, అలాంటి ఆటోలకు ప్రమాదాలు జరిగితే అందరూ చనిపోతారని కూడా ఆలోచించరని అన్నారు. అయితే తాను రూల్స్ కు ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులు చేయకపోతే మా ఎమ్మెల్యే ఇంత చిన్న పనులు కూడా చేయించలేకపోయారని విమర్శిస్తారన్నారు. అయితే ప్రజలందరినీ కాపాడుకోవడానికి తాను రూల్స్ ఫాలో కావాలా, లేకపోతే మరోసారి ఎమ్మెల్యే కావడానికి రూల్స్ ను అతిక్రమించి మీరు చెప్పేది వినాలా అనే విషయం గురించి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణాలను కాపాడటం కోసమే పెట్టారని వాటిని పాటించకపోతే ఎలాగని ప్రశ్నించారు. పదహారేళ్ల వయస్సు ఉన్న వారికి వితవుట్ గేర్ లైసెన్స్ ఇస్తారని, 18 ఏళ్లు నిండిన వారికి విత్ గేర్ లైసెన్స్ ఇస్తారని గుర్తు చేసారు. అయితే కొంత మంది పన్నెండు, పధ్నాలుగేళ్ల కూడా నిండని పిల్లలు వాహనాలు నడుపుతుంటారని, వాహనంలో తామొక్కరే కాకుండా త్రిబుల్ రైడింగ్ కూడా చేస్తుంటారని, కొంత మంది పిల్లలు వాహనాలను అత్యంత వేగంగా నడుపుతూ తన వాహనాన్ని కూడా ఓవర్ టేక్ చేసి వెళ్లడాన్ని గమనించానని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో తమ పిల్లలకు చిన్న వయస్సులో వాహనాలు ఇవ్వకుండా చూడాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లలు చిన్న వయస్సులోనే వాహనాలు నడుపుతున్నారని మురిసిపోవడం ఎంత వరకు సమంజసమని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం కూడా సరికాదన్నారు. జడ్చర్ల మీదుగా బెంగుళూరు జాతీయ రహదారి (హైవే 44), రాయచూరు- కోదాడ జాతీయ రహదారి ( హైవే 167) వెళ్తున్నాయని ఈ కారణంగా ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా తరుచుగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయని చెప్పారు. బెంగుళూరు హైవే పై ముదిరెడ్డిపల్లి నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే జడ్చర్లకు బైపాస్ రోడ్డు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరడం జరిగిందని, రూ.600 కోట్ల వ్యయంతో జడ్చర్ల బైపాస్ కూడా రూపుదిద్దుకోనుందని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. అలాగే జడ్చర్ల పట్టణంలో వాహనాల రద్దీని నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల కు రూరల్ పోలీస్ స్టేషన్ ను కూడా మంజూరు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డికి అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఆలూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డితో పాటుగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ జానకి, అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు