ఉప్పల్ రవాణా కార్యాలయంలో మూడు నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్, లైసెన్స్ కార్డుల పంపిణీ

కార్యాలయంలో కుప్పలుగా పేరుకుపోయిన కార్డులు.. నిత్యం అధికారులను నిలదీస్తున్న వాహనదారులు.. ట్రాఫిక్ తనిఖీల్లో ఇబ్బందులు.. “వాహన్” పోర్టల్ మార్పులతో డిస్పాచ్ ప్రక్రియకు బ్రేక్..!
ఉప్పల్, జూలై 15 ( జనం సాక్షి ): ఉప్పల్ ప్రాంతంలోని రవాణా శాఖ కార్యాలయంలో గత మూడు నెలలుగా వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు, యాజమాన్య మార్పులు చేయించుకున్న వారు, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు తమ కార్డుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ రవాణా కార్యాలయంలో వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది. కార్డులు ఎప్పుడు అందుతాయో తెలియక ప్రతిరోజూ కార్యాలయానికి వస్తున్న ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారులు కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అసలు రిజిస్ట్రేషన్ కార్డు చూపించాలని కోరుతుండగా, “రిజిస్ట్రేషన్ పూర్తయింది.. కానీ కార్డు రాలేదు” అని వాహనదారులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులకు, వాహనదారులకు మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికీ ఇదే సమస్య ఎదురవుతోంది. ఉద్యోగాలు, బ్యాంకు పనులు, ఇతర అధికారిక అవసరాల కోసం లైసెన్స్ కార్డు అవసరమైన సమయంలో చేతిలో కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు మాత్రం “వాహన్” పోర్టల్‌లో జరిగిన సాంకేతిక మార్పులు, డిస్పాచ్ వ్యవస్థలో ఏర్పడిన సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల పంపిణీ ఆలస్యమవుతోందని చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నప్పటికీ, మూడు నెలలు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ రవాణా కార్యాలయంలో పేరుకుపోయిన అన్ని రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను వెంటనే పంపిణీ చేసి, “వాహన్” పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రవాణా శాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితితో ప్రతి రోజూ వందలాది మంది ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



