దీపావళి రోజూ ఇథనాల్‌ ఫ్యాక్టరీపై ఆగని పల్లెల పోరు

జోగులాంబ గద్వాల జిల్లా (జనంసాక్షి) : నాకెందుకు, మనకెందుకు అనుకుంటే చాలా పెద్ద తప్పు. గ్రామాల్లో ఇప్పటికీ కొందరికి తెలియడం లేదు. అలాంటివారందరికీ ఊరూరా తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నవారు మరింత క్షుణ్ణంగా తెలియజేయాలని రాజోలి మండలవ్యాప్తంగా ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక సమితి పోరాటం ఉధృతం చేసింది. పచ్చని ఊర్లు పాడైతుంటే పండుగెట్లా చేసుకోవాలంటూ దీపావళి రోజునా ఊరూరా అవగాహన కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. చిన్నతాండ్రపాడు, కేశవరం, వేనిసోంపురం, నౌరోజీ క్యాంపు, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచే ఇథనాల్‌ ఫ్యాక్టరీ అనర్థాల గురించి ప్రజలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు, వ్యవసాయ కూలీల పనులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోరాట సమితి సభ్యులు జన సమీకరణ చేస్తూ ఫ్యాక్టరీపై పోరాటం కొనసాగిస్తున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా పెద్దఎత్తున కదిలొస్తున్న జనం.. నీరు, గాలి, పంటలను కలుషితం చేసే ఫ్యాక్టరీ మాకొద్దూ అంటూ ముక్తకంఠం వినిపిస్తున్నారు. చెట్ల కింద, రచ్చబండల వద్ద మూకుమ్మడిగా చర్చించుకుంటూ ఎలాగైనా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుని తీరాల్సిందేనని భీష్మిస్తున్నారు. ఇథనాల్‌ పరిశ్రమ తరలిపోయేదాకా ఈ నిరంతరం పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా పెద్ద ధన్వాడ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి స్పష్టం చేసింది.