క్షేత్రస్థాయిలో అడ్రస్ లేని కాంట్రాక్టర్, పర్యవేక్షించని అధికారులు

ప్రజాధనం లూటీ అవుతుంటే కళ్లు మూసుకున్నారా? – మండల ప్రజల నిప్పులు

మాడుగులపల్లి, జూలై 17( జనం సాక్షి): ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు దండుకుంటుంటే, పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు మాడుగులపల్లి మండల కేంద్రం నుంచి ఎల్లమ్మగూడెం ఎక్స్ రోడ్డు వరకు సాగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పూర్తిగా అడుగంటింది నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ పనుల తీరుపై మండల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఈ పనుల్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా, అధికారులు కళ్లు మూసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాత రోడ్డుపైనే మట్టి పూత!

నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ లేదా పునర్నిర్మాణం చేపట్టేటప్పుడు పాత రోడ్డును పూర్తిగా తొలగించి (స్క్రాపింగ్ చేసి), ఆ తర్వాతే మట్టి, జీఎస్బీ (గ్రావెల్) వేసి రోలర్‌తో రోలింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు శ్రమ, ఖర్చు తగ్గించుకోవడమే ధ్యేయంగా పాత తారు రోడ్డును అలాగే ఉంచి, దానిపైనే మట్టి పోస్తూ నామమాత్రపు పనులతో మమః అనిపిస్తున్నారు ఈ నాసిరకం పనుల వల్ల వర్షం పడితే రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, కేవలం బిల్లులు గుంజేందుకే ఈ నాసిరకం పనుల తంతు నడుపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

అటు కాంట్రాక్టర్ లేడు ఇటు అధికారి లేడు!

ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నప్పటికీ పర్యవేక్షణ అనేది శూన్యంగా మారింది పనులు జరిగే ప్రాంతంలో కాంట్రాక్టర్ కానీ, కనీసం అతని తరఫున పనులను చూసే బాధ్యులైన సూపర్వైజర్లు కానీ ఉండటం లేదు ఇక ప్రభుత్వ శాఖకు చెందిన సంబంధిత అధికారులు అసలు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం కాంట్రాక్టర్‌తో అధికారులు చేతులు కలిపారా? లేక ఏసీ గదులకే పరిమితమయ్యారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అసలు అధికారులు ఉన్నారా నిద్రపోతున్నారా?

రోడ్డు పనుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం కాంట్రాక్టర్ జేబుల్లోకి వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఈ మండలంలో అసలు పర్యవేక్షించే అధికారులు ఉన్నారా లేరా అన్నట్లుగా పరిస్థితి తయారైంది

మండల ప్రజల ఆవేదన ఉన్నతాధికారులు స్పందించాలి

గుత్తేదారు నిబంధనల ప్రకారం పనులు చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మాడుగులపల్లి – ఎల్లమ్మగూడెం ఎక్స్ రోడ్డు పనులను స్వయంగా తనిఖీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చూడాలని కోరుతున్నారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

తాజావార్తలు