తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి..!?

హైదరాబాద్‌ : ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపిక విషయం అధిష్టానం వద్దకు చేరడంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఈరోజు సమాలోచనలు జరిగాయి. ఇందులో రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌, మురళీధరన్‌ ఈ భేటీలో పాల్గొనగా.. మెజారిటీ సభ్యులు రేవంత్‌వైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. సీఎల్పీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా సీఎంతో పాటు మంత్రివర్గ కూర్పుల విషయంలోనూ చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ సమావేశం ముగియగానే రాహుల్‌గాంధీ అక్కడినుంచి వెళ్లిపోవడంతో ఇక ప్రకటన లాంఛనమేనని సమాచారం. మరికొద్దిసేపట్లో డీకే శివకుమార్‌ హైదరాబాద్‌కు రానున్నారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థిని, ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాలను డీకే ప్రకటిస్తారు. అంతకుముందు ఉత్తమ్‌, భట్టి విక్రమార్కలతో వేర్వేరుగానే కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చించినట్టు తెలిసింది.