సీఎంతో జిహెచ్ఎంసీ మేయర్ భేటీ

హైదరాబాద్ : జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాల పైన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వపరమైన చర్యలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. ప్రత్యేకంగా పురపాల శాఖ మంత్రి లేకపోవడం, ఆ శాఖకు బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో మరింత చొరవ చూపాలని ఆమె కోరారు. ఈరోజు ముఖ్యమంత్రి నివాసంలో మేయర్ రేవంత్ రెడ్డిని కలిశారు.

రాష్ట్రానికే అత్యంత కీలకమైన ఆర్థిక ఇంజన్ హైదరాబాద్ నగరం పరిపాలనకు ఎన్నికల కోడ్ వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నవంబర్లో అమలులోకి వచ్చిన ఎన్నికల నియమావళి standing committee కి అడ్డంకిగా మారిందన్నారు. దీంతోపాటు ఆగస్టులో జరగవలసిన జిహెచ్ఎంసి జనరల్ బాడీ సమావేశం కూడా ఇంకా పెండింగ్లో ఉంది అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్రాస్ కి పలుసార్లు ఆదేశాలు జారీ చేశామని, అయితే ఈ అంశంలో ప్రభుత్వ సూచనల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు అన్నారు. దీంతో ఈ అంశం లో కలుగజేసుకొని వెంటనే జిహెచ్ఎంసి పరిపాలన సజావుగా సాగడంతో పాటు, రాష్ట్ర రాజధాని కి అత్యంత కీలకమైన జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మార్గం సుగమం అయ్యేలా జనరల్ బాడీ సమావేశాన్ని నేరుగా నిర్వహించేలా జిహెచ్ఎంసి కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని గద్వాల విజయలక్ష్మి కోరారు.

మరోసారి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున ఈ అంశంలో వేగంగా స్పందించాలని ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన నగరంలో తమ తమ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిహెచ్ఎంసి కార్పొరేటర్ల నుంచి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటుకు తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల కోడ్ మరోసారి అమరులకు వస్తే బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవడం మరింత ఆలస్యం అవుతుందన్నారు. మేయర్ విజయలక్ష్మి తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాల పైన అనుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ అంశం పైన తీసుకోవాల్సిన చర్యలన్నింటిని వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే తాను ముఖ్యమంత్రిని కలిసిన అంశం పైన కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న అంశం తన దృష్టికి వచ్చిందని మేయర్ విజయలక్ష్మి అన్నారు. కేవలం పరిపాలనాపరమైన అంశాలు, మునిసిపల్ శాఖకు బాధ్యత వహిస్తున్నది ముఖ్యమంత్రి కావడం, అన్నిటికన్నా ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే జిహెచ్ఎంసి బడ్జెట్ని ఆమోదింప చేసుకోవాలన్న సదుద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిపారు. దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యము లేదని, భారత రాష్ట్ర సమితి కార్యకర్తగా, కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని ఇందులో ఎవరికి ఏ అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు.