ఎట్టకేలకు స్పందించిన హైడ్రా

మే 4,జనం సాక్షి:ప్రజా వ్యతిరేకతతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. రాఘవ క్రషర్స్‌తో పాటు పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్ మెషిన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖల సాయంతో హైడ్రా వీటిని కూల్చివేసింది.

జీవో 111 ఉల్లంఘిస్తూ క్రషర్స్ ఏర్పాటు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ఏకంగా జీవో 111ను ఉల్లంఘిస్తూ క్రషర్స్‌ నడుపుతున్నా.. రెండేండ్లుగా నిరాటంకంగా అక్రమ మైనింగ్‌ కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని కొంతకాలంగా స్థానికులు విమర్శిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం ‘అనుమతిలేని ఆ క్రషర్‌ను మూసివేయండి’ అని క్లోజర్‌ ఉత్తర్వులు ఇచ్చి, ఆ కాగితాలను కోల్డ్‌ స్టోరేజీలో పడేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొత్వాల్‌గూడలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. అసెంబ్లీలో సైతం రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత రావడంతో చివరకు పొంగులేటిని ఒప్పించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలు మొదలుపెట్టింది.