ఇళ్లలో ఐఈడీలు అమర్చి… సైన్యానికి పహల్గామ్ ఉగ్రవాదుల ట్రాప్..?
జమ్మూకశ్మీర్ (జనంసాక్షి): పహల్గామ్ లో నరమేధం సృష్టించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆషిఫ్ షేక్ తమను వెతుక్కుంటూ సైన్యం వస్తుందని భావించి.. తమ ఇళ్లలో ఐఈడీ అమర్చి… వారికి ట్రాప్ పెట్టారు. అయితే, త్రుటిలో ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకోగలిగారు. త్రాల్‌కు చెందిన ఆషిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించేందుకు జమ్మూకశ్మీర్ పోలీసులు వెళ్లారు.దీంతో వారు వెంటనే బయటకు రాగా… కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. పహల్‌గామ్ మారణహోమంలో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన థోకర్ కీలక నిందితులలో ఒకరు కాగా, ఆషిఫ్ షేక్ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బిజ్‌బెహరా, త్రాల్ ప్రాంతాల్లోనూ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. లోకల్ ఉగ్రవాదుల నివాసాలపై దాడి చేస్తున్నాయి. మరోవైపు ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ పోలీసులు గురువారం ప్రకటించారు. కాగా, మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అటు పాకిస్థాన్ కూడా భారత్‌పై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.