హైదరాబాద్ బుక్ ఫెయిర్ పై కోయ చంద్రమోహన్ ఆరోపణలు స్వార్థపూరితం

స్పందించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ

హైదరాబాద్ (జనంసాక్షి) : 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహణ నేపథ్యంలో కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భావించి, వ్యవస్థను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అబద్దాలను పదే పదే వల్లెవేస్తూ గోబెల్స్ లాగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా పుస్తక ప్రదర్శన నాలుగు దశాబ్దాలుగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతోంది. ఈ నేపథ్యంలోనే కాపీరైటు ఉల్లంఘించిన వారిని, పైరసీకి పాల్పడేవారితోపాటు లెక్కలు చెప్పకుండా, సొసైటీ ఆర్థిక లావాదేవీలను తమ ప్రయోజనాలకోసం ఉపయోగించుకున్నవారిని సొసైటీ జనరల్ బాడీ సభ్యుల తీర్మానం మేరకు 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పాల్గొనకుండా తొలగించడం జరిగింది. అందులో భాగంగా కోయ చంద్రమోహన్ తెలంగాణ పబ్లికేషన్స్ ను జనరల్ బాడీ తీర్మానం ప్రకారం తొలగించడం జరిగింది.

ఆయన బుక్ ఫెయిర్ కు బాధ్యుడిగా ఉన్న కాలపు ఆర్థిక అంశాలకు సంబంధించిన విషయాల గురించి, వాటికి సంబంధించిన పత్రాల గురించి ముందస్తుగా లేఖలరూపంలో పంపుతూ, వారి వివరణలు కోరడం జరిగింది. దీనిపై కనీస స్పందన, వివరణ లేకుండా వ్యవస్థపై ఏకపక్షంగా పత్రికారూపంగా, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకోవడం, వారి వ్యక్తిగత దిగజారుడుతనంగా భావిస్తున్నాం.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు గతంలో కార్యదర్శిగా ఉన్న కోయ చంద్రమోహన్, అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ని, కోశాధికారిగా ఉన్న పి. రాజేశ్వరరావుని, ఒక సంవత్సరం కాలం కార్యదర్శిగా ఉన్న శృతికాంత్ భారతిని వారు పనిచేసిన కాలపు ఆర్థిక లావాదేవీల పత్రాలు, మినిట్స్ బుక్, ఇతర అవసరమైన అంశాలను కోరుతూ, వివరణలు కోరుతూ 21.2.2024 న జరిగిన జనరల్ బాడీ తీర్మానం తర్వాత ఏర్పడిన ప్రత్యేక కమిటీ రిజిస్టర్ పోస్టులో వారికి ఉత్తరాలు పంపింది.

మొదటి ఉత్తరం 29.5.2024 న రాసి ఒక వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. రెండవ ఉత్తరం 22.6.2024 న రాసి, 30.6.2024 వరకు వివరణ ఇవ్వాలని కోరింది. ఆ తర్వాత 7.5.2025 న జనరల్ బాడీ నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ లిఖితపూర్వకంగా వారికి పంపింది. 13.5.2025 లోపు మీరు కమిటీ ముందు మీ వివరణలు ఇవ్వాలని కోరింది. లేని యెడల ఈక్రింది విధంగా చర్యలు ఉంటాయని ఆ లేఖలో రాయడం జరిగింది.
1. సభ్యత్వ తాత్కాలిక నిలుపుదల.
2. ప్రెస్ మీట్ పెట్టి మీపై ఉన్న ఆరోపణలు వెల్లడిచేయడం.
3. మీపై ఉన్న ఆరోపణలను లేఖల రూపంలో బుక్ ఫెయిర్ పార్టీసిపెంట్లు అందరికి తెలియజేయడం.
4. రానున్న బుక్ ఫెయిర్ లలో మీరు, మీ తరఫున మరెవరూ పాల్గొనకుండా నిలుపుదల చేయడం.

ఇన్ని ప్రయత్నాల మీదటకూడ రికార్డుల అప్పగింత ఇత్యాది అంశాల గురించిన ఏ రకమైన స్పందన లేని దశలో ఈసారి బుక్ ఫెయిర్ నిర్వహణకు ముందు స్టాల్స్ ఎంపిక స్క్రీనింగ్ కమిటీ, పై అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, జనరల్ బాడీ తీర్మానానికి అనుగుణంగా ఈసారి స్టాల్ కోసం అప్లై చేసుకున్న తెలంగాణ పబ్లికేషన్స్ (కోయ చంద్రమోహన్) స్టాల్స్ ను నిలుపుదల చేయడం జరిగింది. ఇదీ విషయం.

సొసైటీ పేరు మీద అఫీషియల్ అకౌంట్ ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ పేరుతో ఉండగా, ‘ద హైదరాబాద్ బుక్ ఫెయిర్’ పేరిట మరో కొత్త అకౌంట్ తెరిచి అందులోంచి లావాదేవీలు జరపడం – కొత్త కార్యవర్గం ఎన్నిక తరవాత వాటి వివరాలు తెలపకుండా దాచి, ఏకపక్షంగా అకౌంట్స్ ను మూసివేయడం – వంటివి సొసైటీని మోసగించడం, అకౌంట్స్ లోని లావాదేవీల అసలు నిజాలు దాచడం అవుతుంది.

కోయ చంద్రమోహన్ సెక్రటరీ బాధ్యతలు ముగిసిన తర్వాత కూడా ఆ తర్వాతి నూతనసెక్రటరీ పేరుమీదకు బాంక్ ఖాతాలు మార్చకపోవడం పెద్ద నేరమైతే, కోయ చంద్రమోహన్, కోశాధికారి బాంక్ లావాదేవీలను తమ సంతకంతో నిర్వహించడం, ఎవరికీ తెలియకుండా రెండు బాంక్ ఖాతాలను మూసివేయడం క్షమించరాని పెద్ద తప్పు.

ఆర్టీఐ నుంచి సేకరించిన బ్యాంకు ఖాతాల ఆధారాలప్రకారం అందులో పెద్దఎత్తున అనుమానాలు కలిగించే అనేక లావాదేవీలు ఆ అకౌంట్స్ లో జరిగినట్లు గుర్తించడం జరిగింది. ఈ వివరాలు ఏమిటో కమిటీకి చెప్పవలిసిన బాధ్యత అతనిమీద, అప్పటి బాధ్యులమీద ఉంది.

వాటి వివరాలు సొసైటీకి అకౌంట్స్ లావాదేవీలు వివరించడం, చూపడం బాధ్యత. కానీ అది జరగలేదు. ఇవన్నీ అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిచ్చే అంశాలు. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు. అందుకే సొసైటీ ముందస్తుగా లేఖలు రాసింది. వివరాలు, పత్రాలు, సంబంధించిన మినిట్స్ బుక్, రిసీప్ట్స్, ఓచర్స్ అడిగింది. ఇవన్నీ ఉండగా కేవలం స్టాల్ కేటాయించలేదనే వాదననే పదే పదే కోయ చంద్రమోహన్ ముందుకు తేవడం ఎంత సమర్థనీయం?

ఇంత విషయం ఉండగా, బుక్ ఫెయిర్ కమిటీ స్టాల్ కేటాయింపు చేయకపోవడం అప్రజాస్వామికమని ఒక్క ముక్కలో చెప్పబూనడం విడ్డూరం. సహేతుకమైన సమాచారం ఇవ్వకుండా, ఆడిగిన ప్రశ్నలకు వివరణలు ఇవ్వకుండా, అడిగిన సమాచారాన్ని వారి తర్వాత ఎంపిక కాబడిన కమిటీకి అప్పగించకుండా – జరిగిన అన్ని విషయాలను దాటవేస్తూ, దాచివేస్తూ వ్యవస్థపై ఆరోపణలు చేయడం, నిందలు మోపడం అసంబద్ధం. పైగా తెలంగాణ పబ్లికేషన్స్ పేరుతో ఉన్న పబ్లికేషన్ ను స్వరాష్ట్రంలో పెట్టనీయక పోవడం నేరమనే ఒక రెచ్చగొట్టే ఆరోపణ. అసలు బుక్ ఫెయిరే తెలంగాణకు ఒక సింబల్ గా రూపొందింది. ప్రాంగణానికి రాష్ట్ర గీతం “జయజయహే తెలంగాణ” రచించిన అందెశ్రీ పేరు పెట్టడం, ప్రధాన వేదికకు తెలంగాణ ఉద్యమకెరటం అనిశెట్టి రజిత పేరు పెట్టుకోవడం, మరో వేదికకు కొంపెల్లి వెంకట్ గౌడ్ పేరును పెట్టడం.. ఇందులో భాగం.

ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు – గతంలో కోయ చంద్రమోహన్ కార్యదర్శిగా ఉన్న కాలంలోనే బుక్ ఫెయిర్ పనివిధానాన్ని ప్రశ్నిస్తూ కరపత్రాలు పంచినందుకు ఒకరిని అప్పటి బుక్ ఫెయిర్ కమిటీ – స్టాల్స్ పెట్టకుండా నిలుపుదల చేయడం గుర్తుచేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అలాగే క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని సభ్యులచేత క్షమాపణలు చెప్పించుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఇదేదో తొలిసారిగా బుక్ ఫెయిర్ కమిటీ చేస్తుందనే ప్రచారం సరైనది కాదు.

యాకూబ్ సొసైటీ అధ్యక్షుడు. ఒక సంస్థలో ఉన్నప్పుడు ఆ సంస్థ అభిప్రాయాలు అతని అభిప్రాయాలుగా ఉంటాయి. అతని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం భావ్యమైన చర్యకాదు. సొసైటీ నిర్ణయాలే అతని నిర్ణయాలుగా ఉంటాయి.

19.12.2025 , నిన్న బుక్ ఫెయిర్ సొసైటీ కార్యవర్గం అత్యవసర సమావేశం జరిగింది. అందులో కోయ చంద్రమోహన్ ‘తెలంగాణ పబ్లికేషన్స్’ కు స్టాల్ కేటాయించడానికి నిర్ణయం జరిగింది. అయితే, మేము కోరిన అన్ని పత్రాలు, మినిట్స్ బుక్స్, బ్యాంక్ అకౌంట్స్ గురించి వివరణలు – ఐదు రోజులలోపల సొసైటీకి అప్పగిస్తానని లిఖితపూర్వకంగా సొసైటీకి లెటర్ ఇస్తే తెలంగాణ పబ్లికేషన్స్ కు స్టాల్ కేటాయించాలని నిర్ణయం జరిగింది. లేని యెడల చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కార్యవర్గం నిర్ణయించింది.

– హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ