జగిత్యాల జిల్లా ధర్మపురి పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రి

దేవాదాయశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్
ధర్మపురి,జగిత్యాల జిల్లా జూలై 14(జనంసాక్షి) : 2027 గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్లను దేవాదాయశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన మంత్రి, పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ధర్మపురిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బైపాస్ రోడ్లు, స్నాన ఘాట్లు, టాయిలెట్లు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, భద్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాల అభివృద్ధికి తొలి విడతలో రూ.117 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను తొలి విడతలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం అదనంగా రూ.50 కోట్ల నిధులను ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, భక్తులకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కల్పించడంలో ప్రభుత్వం రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశీలనలో దేవాదాయశాఖ, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, పోలీసు, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొని, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రికి వివరాలు అందించారు.



