ఉత్తరాదిలో  మండుతున్న ఎండలు

 నైరుతి రుతిపవనాల ప్రభావంతో దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కాస్త చల్లబడగా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఎండలతో తుకతుక ఉడికిపోతున్నాయి. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుడు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

మంగళవారం దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఢిల్లీలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాజస్థాన్‌లోని చురులో 45.6 డిగ్రీల వేడి ఉండగా.. సాయంత్రానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

ఆగ్రాలోనూ కొద్దిసేపు వర్షం పడింది. జమ్మూలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఈ నెల 17 వరకు హీట్‌ వేవ్‌ ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికంగానే ఉంది.