ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల నిర్లక్ష్యం ఇందుగుల సిసి రోడ్డుపై వాహనదారుల నరకయాతన

వాటాల మత్తులో అధికారులు దున్నపోతుపై వర్షం చందంగా వ్యవస్థ
పత్రికల్లో కథనాలు వచ్చినా కదలని కాంట్రాక్టర్, అధికారులు
రోడ్డు మధ్యలోనే నిలువెత్తు విద్యుత్ స్తంభాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం
మాడుగులపల్లి, మే 20 ( జనం సాక్షి ):దున్నపోతుపై వర్షం కురిసినట్లు తయారైంది మాడుగులపల్లి మండలంలోని ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల అధికారుల తీరు మండల పరిధిలోని ఇందుగుల గ్రామంలో సాగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ల అడ్డగోలు తనం, అధికారుల కమీషన్ల కక్కుర్తి స్పష్టంగా కనిపిస్తోంది మాడుగులపల్లి నుంచి మామిడాల అడ్డరోడ్డు వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇందుగుల గ్రామ పరిధిలో సిసి రోడ్డు నిర్మించారు అయితే, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే, వాటి చుట్టూ సిసి రోడ్డు వేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు ఈ దారుణమైన ఇంజనీరింగ్ లోపంపై పత్రికల్లో వరుస కథనాలు వచ్చినా, సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచినా ఇటు ఆర్ అండ్ బీ (R&B) అధికారులలో గానీ, అటు విద్యుత్ శాఖ అధికారులలో గానీ కనీస చలనం లేకపోవడం గమనార్హం.
ఎవరి వాటా వారికి అందితే చాలునా?
నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ చేపట్టే ముందే విద్యుత్ స్తంభాలను రోడ్డు పక్కకు మార్చాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తారు కానీ, ఇక్కడ కనీస నిబంధనలను గాలికొదిలేశారు ఎవరి వాటా వారికి అందితే చాలు ప్రజల ప్రాణాలు పోయినా మాకేంటి?అనే ధోరణిలో కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కయ్యారని గ్రామస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు పనులు త్వరగా ముగించి బిల్లులు పాస్ చేయించుకునే ఆరాటంలో ఉన్న కాంట్రాక్టర్‌కు అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని, కమీషన్ల కోసమే ఈ అడ్డగోలు నిర్మాణాన్ని చూసీచూడనట్లు వదిలేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృత్యుపాశాలుగా మారిన స్తంభాలు వాహనదారుల ఆవేదన
రోడ్డు మధ్యలోనే నిలువెత్తు కరెంటు స్తంభాలు ఉండటంతో వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను ఢీకొట్టే పరిస్థితి నెలకొంది ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ స్తంభాలు సరిగ్గా కనిపించక ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడుతున్నారు పెద్ద ప్రమాదం జరిగి ఎవరిదైనా ప్రాణం పోయాక గానీ అధికారుల నిద్ర లేవదా? అని రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్రికా కథనాలకు కూడా స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఈ అవినీతి రోడ్డు పనులపై విచారణ జరపాలని, వెంటనే ఆ విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఇందుగుల గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాణం పోయాక స్పందిస్తారా?గ్రామస్తుల ఆగ్రహం
పత్రికల్లో వార్తలు వచ్చినా కరెంటు అధికారులకు, ఆర్ అండ్ బీ అధికారులకు కనీసం కనిపించడం లేదా అని ఇందుగుల గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు రోడ్డు మధ్యలో స్తంభాలు పెట్టి వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని వాపోతున్నారు అధికారులు తమ ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని, లేనిపక్షంలో గ్రామస్తులమంతా కలిసి రహదారిపై ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.



