వికారాబాద్ కలెక్టర్ పై ప్రజల దాడి
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఫార్మా విలేజ్ కోసం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక తహశీల్దార్ కార్లపై రైతులు రాళ్లు విసిరి దాడికి దిగారు. దుద్యాల మండలం లగచర్ల గ్రామ శివారులో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, కొడంగల్ కాడ వెంకటరెడ్డి, పోలీసులపై ఈ దాడి జరిగింది. రైతుల దాడిలో కలెక్టర్, తహశీల్దార్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వారితో మాట్లాడేందుకు వచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లగచర్లకు 2 కిమీ దూరంలో అధికారులు గ్రామ సభ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఈ గ్రామ సభలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలుసుకున్న స్థానిక రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ దాడిలో కొడంగల్ ఎమ్మార్వో విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ వాహనం ధ్వంసం అయ్యింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.