రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు: ఎస్.ఐ.జాడి శ్రీధర్
రామకృష్ణాపూర్, మే12(జనంసాక్షి):సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రామకృష్ణాపూర్ ఎస్సై జాడి శ్రీధర్ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రౌడీషీటర్లకు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రౌడీషీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. చిన్నచిన్న వివాదాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా చట్టాలను గౌరవించాలని హితవు పలికారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, భూవివాదాలు, బెదిరింపులు, దాడులు, అక్రమ వసూళ్లు వంటి ఘటనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు అవసరమైతే జైలుకు పంపించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.అలాగే సత్ప్రవర్తనతో ఉండి, పోలీసుల సూచనలు పాటిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకునే వారిపై నమోదైన రౌడీషీట్లను సమీక్షించి తొలగించే అవకాశం ఉంటుందని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి కుటుంబ సభ్యుల గౌరవాన్ని కాపాడాలని సూచించారు.కౌన్సిలింగ్ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



