ఎకో టౌన్‌కు వ్యతిరేకంగా ప్రజాగర్జన

•15 గ్రామాల ప్రజల ప్రాణాలను కాపాడండి – జీవో నెం.20 రద్దు చేయాలి

•డంపింగ్ యార్డ్ మాకొద్దు.. యూనివర్సిటీ ఏర్పాటు చేయండి

•భారీ పాదయాత్ర, రోడ్డుపై బైఠాయించి నిరసన

 

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 14(జనం సాక్షి ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గువ్వలేటి గ్రామ ఎక్స్‌రోడ్ నుండి చిన్న రావిరాల, బండరావిరాల మీదుగా సద్దుపల్లి ఎక్స్‌రోడ్ వరకు ఆదివారం ఎకో టౌన్ పేరుతో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు భారీ పాదయాత్ర నిర్వహించారు. చిన్న రావిరాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో 15 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.సుమారు ఐదు కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో మహిళలు, యువకులు, రైతులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “గో బ్యాక్ ఎకో టౌన్”, “డంపింగ్ యార్డ్ మాకొద్దు”, “ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు”, “జీవో నెంబర్ 20 రద్దు చేయాలి” అంటూ నినాదాలతో ప్రాంతమంతా మారుమోగింది.సద్దుపల్లి ఎక్స్‌రోడ్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం సర్వే నెంబర్ 268లోని 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం ప్రజల జీవితాలతో ఆడుకోవడమేనని మండిపడ్డారు.వారు మాట్లాడుతూ ఇప్పటికే మూసీ నది కాలుష్యం, పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రషర్ మిల్లుల కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నగర ప్రాంతాల చెత్తను గ్రామీణ ప్రాంతాల్లో పడేసే విధంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో భూగర్భ జలాలు కలుషితమవుతాయని, పచ్చని వ్యవసాయ భూములు నాశనమవుతాయని, రైతుల జీవనాధారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. చెత్త నిల్వల వల్ల దుర్వాసనలు వ్యాపించి ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వెంటనే జీవో నెంబర్ 20ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్‌కు బదులుగా విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి, విద్యా అవకాశాలు కల్పించాలని కోరారు. కాలుష్యాన్ని పెంచే ప్రాజెక్టులకు బదులుగా అభివృద్ధి, ఉపాధి కల్పించే సంస్థలను ఏర్పాటు చేస్తే ప్రాంత భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయపడ్డారు.“మా గ్రామాల ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు, రైతుల వ్యవసాయం ప్రమాదంలో పడేలా ఎలాంటి ప్రాజెక్టులను మేము అంగీకరించము. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కలెక్టరేట్ ముట్టడి, మహాధర్నాలు, నిరవధిక ఆందోళనలు చేపడతాం” అని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, బాధిత గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఎకో టౌన్‌కు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.