శభాష్‌ రెేవంత్‌

` గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతంపై సీఎం రేవంత్‌ రెడ్డిని అభినందించిన ఖర్గే, ప్రియాంక
` సదస్సు వివరాలను అగ్రనేతలకు వివరించిన ముఖ్యమంత్రి
` మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం
ఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్‌ ఆవిష్కరించిందని వారు పేర్కొన్నారు. ఢల్లీిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై వారి మధ్య చర్చ కొనసాగింది. సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై అగ్ర నేతలు సీఎంను ప్రశంసించారు. సీఎం వెంట మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు సురేశ్‌ షెట్కార్‌, మందాడి అనిల్‌ కుమార్‌, పోరిక బలరాం నాయక్‌, డాక్టర్‌ మల్లు రవి, కుందూరు రఘువీర్‌ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు.
మెస్సీ కార్యక్రమానికి హాజరుకండి..
‘మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌’ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ బయలుదేరే ముందు పార్లమెంట్‌ ఆవరణలో సీఎం మీడియాతో మాట్లాడారు. ‘‘ఈనెల 13న ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌ వస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరు అవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రముఖ క్రీడాకారుడు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నాం. దిల్లీలో కలిసిన అందరినీ ఈ కార్యక్రమానికి రావాలని పిలిచా’’ అని తెలిపారు.ఈనెల 13న ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారులు పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో బీసీ బిల్లుపై కేంద్రం స్పందించాలి
` రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని మద్దతు తెలపాలి
` లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ చామల
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం బీసీ బిల్లును ఆరు నెలల క్రితమే గవర్నర్‌ వద్దకు పంపినా.. ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు.. వెంటనే జోక్యం చేసుకుని బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించాలని కోరుతున్నా’’ అని ఎంపీ చామల తెలిపారు.