ప్రజాసేవకులకు అహంకారం ఉండరాదు : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

మహారాష్ట్రలోని నాగపూర్ లో శిక్షణ పొందుతున్న ఆర్ఎస్ఎస్ క్యాడర్ ను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని, నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో విపక్షమే తప్ప విరోధి పక్షం ఉండదని… ఎన్నికలు అంటే పోటీయే తప్ప యుద్ధం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత అవసరం అని, చట్టసభల్లో ఏకాభిప్రాయం సాధించి రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపిస్తారనే ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారని మోహన్ భగవత్ వివరించారు. అయితే, చట్టసభల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కష్టమైన పనే అని, అందుకే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు.

ఎన్నికల్లో గౌరవ మర్యాదలు పాటించాల్సిన అవశ్యకత ఉందని, ఇటీవల ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ ను కూడా లాగారని విచారం వ్యక్తం చేశారు. టెక్నాలజీని ఉపయోగించి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

దేశంలో సమస్యలు ఇంకా ఉన్నాయి కాబట్టి రాజకీయ పక్షాలు గౌరవ మర్యాదలతో నడుచుకోవడం మంచిదని, ఎన్నికల వాతావరణం నుంచి బయటికి వచ్చి దేశ సమస్యలపై దృష్టి సారించాలని మోహన్ భగవత్ హితవు పలికారు.