ఏసీబీకి చిక్కిన ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శి!

సంగారెడ్డి (జనంసాక్షి) : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో కోర్టు కేసు పరిధిలో ఉన్న వివాదాస్పద భూములు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో ఈ భూముల్లో పేదలు ఇల్లు నిర్మించుకుంటే అధికారులు, గత పాలకులు కూల్చివేసిన విషయం తెలిసినదే. అలాంటి భూములలో ఐలాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సచిన్ ఇష్టానుసారంగా ఇళ్ల స్థలాలకు అనుమతులు ఇవ్వడం, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడంతో అతన్ని ఎసిబి అధికారులు తీసుకువచ్చి అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో విచారణ చేపట్టడంతో మళ్లీ ఐలాపూర్ గ్రామం వార్తల్లోకి ఎక్కింది. ఐలాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గత సంవత్సరం ఇంటి నిర్మాణ అనుమతుల విషయంపై కార్యదర్శి సచిన్ కలిసి అనుమతులు కోరగా దానిపై స్పందించిన కార్యదర్శి 30 వేల నగదు కోరడంతో ఆ వ్యక్తులు కార్యదర్శి మాట్లాడిన మాటలను రికార్డు చేసి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇట్టి విషయంపై స్పందించిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టడంతో అవినీతి జరిగిన విషయం వాస్తవమే అని నిర్ధారణకు వచ్చారని తెలిసింది.ప్రస్తుతం కార్యదర్శి సదాశివపేట మండల పరిధిలోని గ్రామంలో పనిచేస్తుండడంతో అక్కడి నుండి అతనిని గురువారం నాడు ఏసీబీ అధికారులు తీసుకుని అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి విచారిస్తున్నట్టు తెలిసింది. ఐలాపూర్ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదును కార్యదర్శి ఒప్పుకున్నట్లు తెలిసింది.

తాజావార్తలు