రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

రూ. 15 కోట్లను వెంటనే చెల్లించి న్యాయం చేయాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు సంబంధం లేదని చెప్పడం న్యాయం కాదు
నేను టిఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్న హయాంలోనే ఊరూరా తిరిగి బోర్లు వేయించాం
చెన్నారావుపేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంది కృష్ణారెడ్డి
చెన్నారావుపేట, ఏప్రిల్ 5 ( జనం సాక్షి): గ్రామ గ్రామాన బోర్లు వేయించుకొని డబ్బులు చెల్లించకపోవడంతో వీధిన పడ్డ నర్సంపేటకు చెందిన శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబానికి వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని చెన్నారావుపేట కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం చెన్నారావుపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శ్రీ లక్ష్మి బోర్ వెల్స్ యజమానులు వీరమల్ల మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన వారికి మద్దతు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016-17వ
సంవత్సరంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న హయాంలో గ్రామాలు, తండాలలో తిరుగుతూ పల్లెనిద్ర కార్యక్రమాలను నిర్వహించాడన్నారు. ఆ సమయంలో నేను టిఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్నానని చెన్నారావుపేట మండలంలో 142 బోర్లను గ్రామాలు, తండాలలో తిరిగి కొబ్బరికాయలను కొట్టి బోర్లను వేయించినట్లు తెలిపారు. నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం నాలుగు మండలాలను కలుపుకొని మొత్తం 154 బోర్లను వేయించారని బోర్లు వేసినందుకు రూ. 93 లక్షలను శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ యజమానులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెల్లించాల్సి ఉందన్నారు. 2016 వ సంవత్సరం నుండి ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బోర్ వెల్స్ యజమానులకు వడ్డీతో కలుపుకొని రూ. 15 కోట్ల అప్పు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలు, తండాలలో తిరిగి బోర్లు వేయించిన కూడా నాకు సంబంధం లేదని నేను వేయించలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాధితులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లను కలిసి వేడుకున్నా హైదరాబాదులోని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన కనీసం పట్టించుకోకపోవడం పద్ధతి కాదన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఒక ఉద్యమ నాయకుడిగా రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామాలు, తండాలలో బోర్లను వేయించుకొని బాధిత బోర్ వెల్స్ యజమానులకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా ద్రోహం చేయడం తగదన్నారు. డబ్బులు చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడ్డాయని తమకు ఉన్న రెండు బోర్ బండ్లను కూడా అమ్ముకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక నర్సంపేటలో తమకు న్యాయం చేయాలని కోరుతూ గత 59 రోజులుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి బాధితులు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని అయినా కనికరించకపోవడం న్యాయం కాదన్నారు. ఇప్పటికైనా శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబానికి రావలసిన డబ్బులను వెంటనే చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గంలోని ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొంత సారయ్య, రావుల తిరుపతిరెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, మారెల్లి కుమారస్వామి, ఎడ్ల నర్సిరెడ్డి, రాధారపు పుల్లారెడ్డి, ఎదురబోయిన శివ, ఎనగందుల భారతి, మారెల్లి సంజీవ, తదితరులు పాల్గొన్నారు.


