సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో ఇండ్ల అమ్మకాలు పడిపోయాయి. ప్రస్తుతం జులై – సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలు 42 శాతం పడిపోయినట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.అభివృద్ధి చెందుతున్న మహానగరం సంక్షోభంలోకి వెళ్తుందనడానికి ఈ నివేదికనే నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్, పిచ్చి కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందన్నారు. రేవంత్ రెడ్డి తీరును ఈ దేశం గమనిస్తుందన్నారు. హైదరాబాద్ నగరం మీ నిర్లక్ష్యాన్ని తప్పకుండా ప్రతిఘటిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.హైదరాబాద్‌లో ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని ప్రాప్‌ఈక్విటీ చెప్తున్నది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయన్నది. దీంతో తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్‌లోనే అత్యంత క్షీణత నమోదవుతున్నది. గత ఏడాదిదాకా దేశంలోనే అత్యంత ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే. ముంబై, బెంగళూరు వంటి నగరాలనూ దాటుకొని గడిచిన పదేండ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది.