కొలిమంటున్న పశ్చిమాసియా

` తీవ్రరూపం దాల్చిన ఇరాన్‌`ఇజ్రాయెల్‌ ఘర్షణలు
` టెహ్రాన్‌పై విరుచుకుపడిన టెల్‌అవీవ్‌
` వైమానికి దాడుల్లో 585 మంది మృతి
` ఇరాన్‌ అనుమూలాలు ఇజ్రాయెల్‌ దాడులు
` సెంట్రిఫ్యూజ్‌ల తయారీ కేంద్రంపై ఫైటర్‌ జెట్లు దాడి
` 1100 లక్ష్యాలను ధ్వంసం చేశామన్న నెతన్యాహు
` నతాంజ్‌ అణుకేంద్రం కూడా ధ్వంసం..
` ఇరాన్‌కూడా ఇజ్రాయెల్‌పై ఎడాపెడా దాడులు
టెల్‌అవీవ్‌,టెహ్రాన్‌(జనంసాక్షి):ఇరాన్‌ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో టెహ్రాన్‌లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇరాన్‌లో 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 239 మంది టెహ్రాన్‌ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్‌ అవీవ్‌లోనూ పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలెంలోని అమెరికా ఎంబసీని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై హైపర్‌ సోనిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్‌ వెల్లడిరచింది. యుద్ధం తీవ్రమవుతుండడంతో వేల సంఖ్యలో ప్రజలు టెహ్రాన్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఇరుదేశాలు మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఇరాన్‌ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అభివర్ణించారు. ఇక, ఇరాన్‌ దౌత్య చర్యలను ఆయన తోసిపుచ్చారు. అవి తప్పుదారి పట్టించేవన్నారు. తాజాగా ఇరాన్‌ను ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు. ఆ దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని.. కానీ ఇప్పట్లో ఆయనను చంపే ఆలోచన లేదని అన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఖమేనీ ‘యుద్ధం మొదలైంది’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌ నుంచి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. దాని అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేంతవరకు ఇజ్రాయెల్‌ ఆగేటట్లు లేదు. తాజాగా టెహ్రాన్‌ అణు కార్యక్రమానికి అత్యంత కీలక పరికరమైన సెంట్రిఫ్యూజ్‌ల తయారీకేంద్రంపై ఐడీఎఫ్‌ ఫైటర్‌ జెట్‌లు దాడి చేశాయి. ఆ దేశ రాజధాని సమీపంలోని ఈ కేంద్రంపై దాదాపు 50 యుద్ధ విమానాలు ఏకకాలంలో విరుచుకుపడ్డట్లు ఐడీఎఫ్‌ వెల్లడిరచింది. దీంతోపాటు చాలా ఆయుధ తయారీ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడిరచింది. అణుబాంబుల తయారీలో సెంట్రిఫ్యూజ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తవానికి అణుబాంబులో యురేనియం 238ను ప్రాసెస్‌ చేసి వెలికితీసిన యూరేనియం 235 మూలకాన్ని వినియోగిస్తారు. ఇందుకోసం సెంట్రిఫ్యూజ్‌ అనే పరికరాన్ని వాడతారు. యురేనియం 238 కొన్ని రసాయనిక చర్యలతో.. యురేనియం హెక్సాఫ్లోరైడ్‌ గ్యాస్‌గా మారుస్తారు. దీనిని సెంట్రిఫ్యూజులోకి పంపించి ప్రాసెస్‌ చేస్తారు. ఈ క్రమంలో అవి దాదాపు 50,000 ఆర్పీఎంకు పైబడిన వేగంతో తిరిగి భారంగా ఉండే యురేనియం 238కి దూరంగా చేరతాయి. ఇక యురేనియం 235 మూలకాలన్నీ మధ్యభాగానికి చేరతాయి. ఇలా పదేపదే చేసి అణుబాంబుకు యురేనియం సేకరిస్తారు. ఇజ్రాయెల్‌ దళాలు ఇప్పటికే చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని అతిపెద్ద అణుకేంద్రమైన నతాంజ్‌ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిన్న రాత్రి ధ్రువీకరించింది. దీంతో ఆ సంస్థ ప్రాథమిక అంచనాలను సవరించినట్లైంది. గతంలో ఈ సంస్థ అధిపతి గ్రోసి స్పందిస్తూ.. ఈ కేంద్రం అండర్‌గ్రౌండ్‌ నిర్మాణాలకు పెద్దగా నష్టం లేదని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత అంచనాలను మార్చుకోవాల్సి వచ్చింది. ఉపగ్రహాల నుంచి సేకరించిన హైరిజల్యూషన్‌ చిత్రాలను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. న్యూక్లియర్‌ థ్రెట్‌ ఇనీషియేటివ్‌ కథనం ప్రకారం ఈ కేంద్రంలో సుమారు 50,000కు పైగా సెంట్రి ఫ్యూజ్‌లను అమర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిలో 14,000కు పైగా అమర్చారు. వాటిల్లో చాలావరకు ఈ దాడిలో దెబ్బతిని ఉండొచ్చని అంచనా.
ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం: ఇజ్రాయెల్‌
ఇరాన్‌ అణు ముప్పును తాము ఓ వ్యూహం ప్రకారం అణచివేస్తున్నామని ఇజ్రాయెల్‌ సాయుధ దళాలు తెలిపాయి. ఇప్పటికే తమ వాయుసేన ఆ దేశంలోని 1,100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ ఎఫీ డెఫ్రిన్‌ పేర్కొన్నారు.‘’మేము ఓ పద్దతి ప్రకారం ఇరాన్‌లోని అణు ముప్పును నాశనం చేస్తున్నాం. మేము చేసే దాడులు వారి నష్టాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. ఫలితంగా వారి బాలిస్టిక్‌ క్షిపణులు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యస్థలు దెబ్బతింటున్నాయి’’ అని పేర్కొన్నారు. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా ఇజ్రాయెల్‌ దళాలు షేర్‌ చేశాయి.ఇజ్రాయెల్‌ వాయుసేన విమానాలు గత శుక్రవారం నుంచి ఇరాన్‌పై దాడులు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ ఇరాన్‌, టెహ్రాన్‌ గగనతలంపై తాము పూర్తిగా పట్టు సాధించినట్లు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 70 ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ బ్యాటరీలను ధ్వంసం చేసినట్లు చెబుతోంది.మరోవైపు ఐడీఎఫ్‌కు చెందిన ఓ భారీ డ్రోన్‌ను కూల్చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ కూడా ధ్రువీకరించింది. తమ మానవ రహిత విమానాన్ని ఇరాన్‌ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని వాడి ధ్వంసం చేసింది’’ అని పేర్కొంది. కాకపోతే దాని నుంచి సమాచారం లీకవుతుందన్న ఆందోళన తమకు లేదని పేర్కొంది. మరో వైపు ఇరాన్‌ నిన్న రాత్రి 30 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో చాలా వాటిని అడ్డుకొన్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడిరచింది.

 

ఇరాన్‌ హద్దులుదాటింది
` నేనేం చేస్తానో ఎవరికీ తెలియదు
` ఖమేనీ హెచ్చరికలపై ట్రంప్‌ స్పందన
ఇరాన్‌ హద్దులు దాటిందని, దీనిపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలపై ట్రంప్‌ మరోసారి స్పందించారు. ఇరాన్‌ లేదా దాని అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసే యోచనలో అమెరికా ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పష్టతనిచ్చేందుకు ట్రంప్‌ నిరాకరించారు. అయితే, టెహ్రాన్‌ హద్దులు దాటిందని, దీనిపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. వచ్చేవారం చాలా కీలక పరిణామం చోటుచేసుకోవచ్చని, అంతలోపే జరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. ‘‘వారం క్రితం.. ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల్లో జోక్యం చేసుకుంటానో లేదో తెలియదు. నేనేం చేయనున్నానో ఎవరికీ తెలియదు’’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో చర్చలు జరిపేందుకు ఇరాన్‌ ప్రతిపాదన చేసిందని చెప్పిన ఆయన.. ఎప్పుడు, ఏవిధంగా అనే విషయాలను వెల్లడిరచలేదు. అయితే, టెహ్రాన్‌ ప్రస్తుతం తననుతాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉందని, గగనతల రక్షణ వ్యవస్థలు కూడా లేవన్నారు.
లొంగిపోయే ప్రసక్తే లేదు – ఇరాన్‌ సుప్రీం లీడర్‌
ఇరాన్‌ అగ్రనాయకత్వం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘గుడ్‌లక్‌’ అంటూ సమాధానమిచ్చారు. టెహ్రాన్‌తో తన యంత్రాంగానికి ఇప్పటికే ఓపిక నశించిందన్నారు. ఈ యుద్ధంలో అమెరికా జోక్యంపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై మాట్లాడుతూ.. దీర్ఘకాల యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధం ఉండకూడదన్నదే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.మరోవైపు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను ఉద్దేశిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్న ట్రంప్‌.. ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీం లీడర్‌ ఖమేనీ ప్రతిస్పందిస్తూ.. లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

యుద్ధం మొదలైంది
` లొంగిపోయే ప్రసక్తే లేదు
` ట్రంప్‌ హెచ్చరికపై ధీటుగా స్పందించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ
` ట్రంప్‌ మితిమీరితే ఆయనకూ ఇదే గతిపడుతుంది
` తమపై దాడి చేసి ఇజ్రాయెల్‌ భారీ తప్పిదం చేసింది
` ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
తమపై దాడి చేసి ఇజ్రాయెల్‌ భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ దాడుల వేళ వీడియో సందేశం విడుదల చేసిన ఆయన.. ఇరాన్‌ లొంగిపోదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ట్రంప్‌ హెచ్చరికలను ఉద్దేశిస్తూ.. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్‌ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందన్నారు. అంతేకాదు అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు.ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఘర్షణల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ఆయన.. తమపై దాడులకు దీటుగా స్పందిస్తామన్నారు.ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో ఖమేనీ ఈ విధంగా స్పందించారు. కాగా ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కన్పిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘యుద్ధం మొదలైంది’ అంటూ అందులో ఖమేనీ రాశారు.ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలపై ట్రంప్‌ నిన్న ఓ పోస్ట్‌ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కొన్నారో తమకు తెలుసని పేర్కొన్న ఆయన.. ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని అన్నారు. ఆయన బేషరతుగా లొంగిపోవాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్‌ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ పోస్ట్‌ కన్పించింది. ‘’నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్‌తో(కత్తి) కలిసి ఖైబర్‌కు వచ్చేశారు’’ అని అందులో రాశారు. దీంతోపాటు ఖడ్గం పట్టుకొని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫొటోను దీనికి జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. ఈ పోస్ట్‌ చూస్తుంటే.. యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. 7వ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్‌పై షియా ఇస్లాం మొదటి ఇమామ్‌ యుద్ధం చేసి అందులో విజయం సాధించారు. నాటి ఘటనను గుర్తుచేస్తూ ఖమేనీ ఈ పోస్ట్‌ పెట్టినట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌’ కథనం పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మరో పోస్ట్‌ చేశారు. ‘’మేం బలంగా ప్రతిస్పందిస్తాం. ఎవరిపైనా దయ చూపేది లేదు’’ అంటూ అందులో రాసుకొచ్చారు.
కొనసాగుతున్న క్షిపణి దాడులు..
మరోవైపు, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్‌ అవీవ్‌లోనూ పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలెంలోని అమెరికా ఎంబసీని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై హైపర్‌ సోనిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్‌ వెల్లడిరచింది.