చరిత్రలో ఇలాంటి ఎన్నిక జరగలేదు
` జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశాన్ని జారవిడవొద్దు
` చారిత్రక తప్పిదకులుగా మిగలొద్దు
` తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి
రాజ్యాంగం ఉండాలా..? బీజేపీ ఉండాలా..?
రాజ్యాంగాన్ని పక్కనబెట్టి దేశాన్ని పాలించాలనుకునేందుకు మొదటిమెట్టు ఇది
బీజేపీ పెద్దలతో తిరగబడి, నిలబడే శక్తిలేక ధన్‌ఖడ్ తప్పుకున్నారు
ఆయనను పారిపోయేలా చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికను తీసుకొచ్చారు
దేశాన్ని ఆక్రమించే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఇదే సరైన సమయం
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
స్పెషల్ కరస్పాండెంట్, జనంసాక్షి :
‘భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎన్నిక మొదటిసారి జరుగుతోంది. ఇది రోటీన్‌గా జరుగుతున్నది కాదు. ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో తెలియకుండా పదవి నుంచి తప్పుకున్నారు. ప్రధాని మోడీతో ఏదో జరిగి తప్పుకున్నారని అనుకోవాలి. ఎందుకంటే, మోడీతో ఇబ్బంది లేకపోతే రాజీనామా చేయాల్సిన పనిలేదు. ఒంట్లో బాగోలేకపోతే నాలుగు రోజులు చికిత్స చేయించుకుంటే సరి’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్‌ఖడ్ విషయం ఓ మిస్టరీగా మిగిలిపోయిందని, ఇటీవలే ఇల్లు కూడా ఖాళీ చేసినట్టు తెలిసిందని, చాలా తీవ్రమైన మనోవేదనలో ఆయన ఉన్నట్టు స్పష్టమవుతోందని చెప్పారు. బీజేపీ వాళ్లను ఎవరు వ్యతిరేకించినా వారి శిరచ్ఛేదనం చేస్తారని, బీజేపీవారికి ప్రస్తుత రాజ్యాంగం పట్లగానీ, జాతీయ జెండాపైగానీ, సెక్యులర్ నిర్మాణం పట్లగానీ, హిందూ ముస్లింలు, క్రైస్తవులు కలిసుండాలనిగానీ నమ్మకం లేదన్నారు. వందేళ్ల నుంచి వాళ్ల ఐడియాలజీ ఇదే పద్ధతిలో కొనసాగుతోందని, ఆ భావజాలంతో విబేధించినవారు వారికే ఓటువేస్తే చరిత్రలో ద్రోహులుగానే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్‌ఎస్ పార్టీలనుద్దేశించి ఉండవల్లి పలు అంశాలను ప్రస్తావించారు.
‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సోషలిస్టులు భావాలున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడ్డారు. ఏ పార్టీకి చెందినవారు కాదు. ఆయనతో నాకు స్వల్ప పరిచయం ఉంది. ఈ మధ్య కాలంలోనే రెండు సమావేశాల్లో కలిసి పాల్గొన్నాం. రాజ్యాంగం పట్ల నిపుణుడు. దానిపై పూర్తిగా అవగాహన కలిగివున్న సమర్థుడు. ఎన్‌డీయే కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా నిలబెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని అందరూ ఎంపీలు మద్దతు తెలిపితే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ కూడా అనుకోవక్కర్లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. తెలుగువాళ్ల కోసం ఎన్‌టీఆర్ పెట్టిన పార్టీ. ఎప్పుడైతే తెలుగు గడ్డ నుంచి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా నిలబడ్డారో అప్పుడే ఆయనకు ఓటువేస్తామని ధైర్యంగా ప్రకటించవచ్చు. నేరుగా వేయడం ఇష్టలేకపోయినా సీక్రెట్‌గా ఓటు వేయొచ్చు. దీంట్లో విప్‌లు ఉండవు. ఎవరు ఎవరికేశారో కూడా తెలియదు. ప్రతిభా పాటిల్ పోటీచేసినప్పుడు శివసేన పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకి. అప్పుడు మేము ఎంపీలం. అపోజిషన్ బెంచీలో గట్టిగా మాట్లాడేవారంతా శివసేనలోనే ఉన్నారు. అట్లాంటివారు యూపీఏ అభ్యర్థి ప్రతిభా పాటిల్‌కు ఓటువేస్తామని డైరెక్టుగా చెప్పారు. మహారాష్ట్ర ఆత్మగౌరవం కోసం పుట్టిన శివసేన ఈ గడ్డ బిడ్డకే మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయొచ్చు. దానివల్ల ఏ నష్టమూ ఉండదు’ అని సూచించారు.
గతంలో అలా.. ఇప్పుడెందుకిలా..?
గతంలో చంద్రబాబు కూడా బీజేపీవాళ్లతో చాలా విబేధించారు. ఈ దేశంలోనే మోడీని, బీజేపీని చంద్రబాబు విమర్శించినంతగా మరెవరూ విమర్శించలేదు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ అంతే. కానీ ఆయన కాంగ్రెస్ కాదు. ఒక ప్రాంతీయ పార్టీ నుంచి బలంగా బీజేపీని వ్యతిరేకించారు. మసీదులు కూలగొట్టే పార్టీ అని నిలదీసింది చంద్రబాబు ఒక్కరే. కాబట్టి ఉప రాష్ట్రపతిగా తెలుగు బిడ్డను ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోవొద్దు. ఇక జగన్‌మోహన్ రెడ్డి పార్టీ ఎన్‌డీయే అభ్యర్థికి మద్దతు తెలుపుతామని ఎలా ప్రకటించిందో అర్థం కావడం లేదు. రెండు పర్యాయాలు కూటమికి వ్యతిరేకంగా పోటీచేసి, ఇప్పుడు ఏ కారణం చేత బీజేపీకి ఓటేస్తామంటున్నారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదేమో, కానీ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారు కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఓ ప్రయత్నంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిలబడ్డారు. నిజంగానే నిలబెట్టగలిగే సత్తా ఉన్న వ్యక్తి. మరి ఇంతకన్నా ఆయనను ఎన్నుకునే అవకాశం ఎక్కడొస్తుంది..? వ్యతిరేకుల పట్ల కూడా సరైన నిర్ణయం చెప్పకపోతే ఎట్లా? వైసీపీ ఎందుకిట్లా చేస్తుందో మరి!
అమిత్ షా కోర్టు ధిక్కరణ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కోర్టు తీర్పును జడ్డిగారికి ఆపాదించి మాట్లాడటం దారుణం. ఇది కోర్టు ధిక్కరణ. ఈ విషయంలో ఈపాటికే పార్లమెంటులో చర్చ జరగాలి. సల్వాజుడుం తీర్పును విమర్శించొచ్చుగానీ, తీర్పునిచ్చిన న్యాయమూర్తి కూడా నక్సలైట్ అని చెప్పడం ఏమిటీ? అసలు ఎటుపోతున్నాం మనం..? రాజ్యాంగంలో ఏముందో దానికనుగుణంగా తీర్పు వస్తుంది. తీర్పు తప్పనుకుంటే 2/3 మెజారిటీతో రాజ్యాంగాన్ని మార్చేయొచ్చు. తప్పుడు ఆలోచనతో తీర్పు ఇచ్చారని భావిస్తే పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నవారు ఏం చేశారు? వెంటనే రాజ్యాంగ సవరణ చేసి కావాలనుకున్నవారికి ఆయుధాలు ఇవ్వొచ్చని చెప్పొచ్చు కదా..? ప్రైవేటు వ్యక్తులకు ఆయుధాలిస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోలేదు. అందుకే సల్వాజుడుంను రద్దుచేస్తూ తీర్పునిచ్చారు. ఇది అందరికీ తెలుసు. రాజ్యాంగపరంగా ఆయుధాలను పట్టుకుని తిరిగే హక్కు కేవలం పోలీసులు, మిలటరీ, పారా మిలటరీ దళాలకే ఉంటుంది. కానీ కొన్ని బ్యాచ్‌లను తయారుచేసి నక్సలైట్లను చంపేందుకు వారికి ఆయుధాలిస్తున్నామని చెప్తే కుదరదు. అదే ప్రభుత్వంలో వాళ్లందరినీ పోలీసులుగా చేర్చుకుంటే ఎవరినీ తప్పుపట్టలేరు. అక్కడున్న గిరిజనులను స్పెషల్ పోలీసుల కింద చేర్చుకుని ఆయుధాలిచ్చుంటే ఆ గొడవ వేరు. కానీ ఎవరికివారు ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకుంటే కుదరదు. ఇదంతా గుర్తించకుండా అమిత్ షావంటి సీనియర్ రాజకీయ నేత కోర్టు తీర్పును తప్పుబడుతూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఎటుపోతున్నామో ఆలోచించుకోవాలి. మొత్తం వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రాధాకృష్ణన్‌ను తీసుకొచ్చారు. ధన్‌ఖడ్ చేత కచ్చితంగా రాజీనామా చేయించారనే అంటాను. అందుకే ఆయన కూడా మాట్లాడటం లేదు. ఏ కారణమూ చెప్పడం లేదు. ఎన్నో అపోహలు వ్యాపిస్తున్నప్పటికీ సమాధానం చెప్పడం లేదంటే.. పైవాళ్ల ఆదేశానుసారమే ఆయన తప్పుకున్నారు. వాళ్లతో తిరగబడి, నిలబడే శక్తి లేక మౌనంగా మారిపోయారు. ఇంకొకర్ని తీసుకొచ్చారు. ఇది ఏరకమైన మార్పు..?
నెగ్గలేని పరిస్థితిలో ఎన్నిక ఇదీ.. ఆలోచించండి
ఒక్క విషయం మరిచిపోకండి, ఆర్‌ఎస్‌ఎస్ అనేటువంటి మాతృసంస్థ, దానికి సంబంధించినటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏంటంటే.. పాంచజన్యం అని తెలుగులో ఉంది, బంచ్ ఆఫ్ థాట్స్ అని గురూజీ గోల్వార్కర్ ఏదైతే రాశారో అదే ఆదర్శం. వరుసగా దానిని అమలు చేస్తూ వస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదని ఆయన స్పష్టంగా రాశారు. అలాగే కమ్యూనిస్టులు, సోషలిస్టులకు కూడా దేశంలో ఉండే హక్కులేదు. ఇది మన ప్రాథమిక సనాతన ధర్మానికి వ్యతిరేకం అని ఆయన చెప్పిన మాటలను టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్ అంగీకరిస్తే వారికి ఓటేయండి. ఇది చిన్న ఎన్నిక కాదు, ఇలాంటి ఎన్నిక భారతదేశంలో ఇప్పటివరకు రాలేదు. ఇది రాజ్యాంగం ఉండాలా..? బీజేపీ ఉండాలా అని తేల్చే ఎన్నిక..! రాజ్యాంగాన్ని పక్కనబెట్టి దేశాన్ని పాలించాలనుకునే బీజేపీ ఆలోచనకు మొదటి మెట్టు ఇది. ఇప్పటివరకు డెమోక్రటిక్‌గా వచ్చారు. వైస్ ప్రెసిడెంట్‌ను పారిపోయేలా చేసి ఎన్నిక తీసుకొచ్చారు. పూర్తి మెజారిటీ ఉన్న సమయంలో తీసుకురాలేదు. మీరు కూడా వేస్తే తప్ప నెగ్గని పరిస్థితుల్లో ఎన్నికను అనివార్యం చేశారు. ఆలోచన చేయండి.
నాడు బ్రిటీషోళ్లు.. నేడు బీజేపోళ్లు..
‘బీజేపీవారి ఆలోచన కరెక్టు, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కరెక్టు, గురూజీ గోల్వార్కర్ చెప్పింది చాలా కరెక్ట్ అని అనుకుంటే వాళ్లకే ఓటేయండి. నేను ఎవర్నీ తప్పుపట్టడం లేదు. బీజేపీ ఎలాగో తమ ఐడీయాలజీ ఇదే అంటుంది. అలాంటప్పుడు మనమేం అనగలం..? వాళ్లను పంపించేస్తాం.. ఈ భావజాలం ఉన్నవాళ్లను బతకనివ్వం అనడం సరికాదు. ఇది సెక్యూలర్ పాలసీ కాదు. కానీ బీజేపీవాళ్లు ఈడీ, సీబీఐ అంటూ భయపెట్టి.. ఏరకంగానైతే బ్రిటీష్‌వాళ్లు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారో, ఏరకంగా గజినీ, ఘోరీ మహ్మద్ వంటివాళ్లు అక్కడిక్కడి గొడవలను ఆసరాగా చేసుకున్నారో.. అదేరకంగా దేశాన్ని బీజేపీ ఆక్రమణ చేసేందుకు ప్రయత్నిస్తుందేమోనని అనుమానం. ఇలాంటివి ఆపాలని అనుకుంటే ఇదే సరైన సమయం. సరైన అవకాశం. దయచేసి ఆలోచించండి. మీకు ఏది నచ్చితే అది’ అంటూ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక
` ఎన్‌డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్..ఇండియకూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి
` ఉదయం 10 గం॥ నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనున్న పోలింగ్
` 6 గం॥ల నుంచి ఓట్ల లెక్కింపు..వెంటనే ఫలితం ప్రకటన
న్యూఢల్లీి(జనంసాక్షి): జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం ఎన్నిక జరుగనుంది. ఈ మేరకు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు ఉభయసభల సభ్యులుగా ఉన్నవారు మంగళవారం జరిగే ఎన్నికలో ఓటేస్తారు. ఈ ఎన్నకలను తెలంగాణకు చెందిన బిఆర్‌ఎస్ బహిష్కరించింది. అలాగే ఒడిషాకు చెందిన బిజూ జనతా దళ్ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. పాలక ఎన్‌డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67), విపక్ష ’ఇండీ’ కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి (79) పోటీచేస్తున్నారు.అన్ని పార్టీల ఎంపీలూ ఇప్పటికే ఢల్లీి చేరుకున్నారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు- భవనంలోని వసుధలో ఎఫ్-101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు- లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. వివిధ రాష్టాల్ల్రో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్‌రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చేశారు. తాను ఏ పార్టీ తరఫునా పోటీ- చేయడం లేదని, రాజకీయాలకతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు.తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన రెండ్రోజుల వర్క్‌షాప్ ఆదివారం ఢల్లీిలో మొదలైంది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్‌డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచనకు దిగారు. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ సోమవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాలులో మాక్‌పోల్ నిర్వహించి.. ఓటు ఎలా వేయాలో వివరించారు.ఉభయసభల్లో ఎన్‌డీఏకే సంఖ్యాబలం ఉంది. రెండు సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మందికి గాను లోక్‌సభలో 542, రాజ్యసభలో 239 మంది ఉన్నారు. ఎన్‌డీఏకి 425 మంది, ఇండీ కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. ఇతర ప్రతిపక్షాల్లో వైసీపీ (11).. ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బీజేడీ (7) మద్దతు కోసం ఆ పార్టీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేశారు. సరైన సమయంలో తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీఆర్‌ఎస్ ఎంపీ కె.సురేశ్‌రెడ్డి విూడియాకు తెలిపారు. అయితే ఈ రెండు పార్టీలు తాజాగా ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. బిఆర్‌ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు.శిరోమణి అకాలీదళ్ వంటి ఏకసభ్య పార్టీలు, స్వతంత్రులు ఎటు- మొగ్గుతారో చూడాల్సి ఉంది. రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగ నున్నందున.. అధికార కూటమి నుంచి సుదర్శన్‌రెడ్డికి క్రాస్‌ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అటు బీజేపీ కూడా.. తమిళనాడు ఎంపీల్లో కొందరు తమ రాష్టాన్రికే చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గుచూపుతారని అంచనా వేస్తోంది. దళిత, ఆదివాసీ ఎంపీలందరూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డికే మద్దతివ్వాలని తమిళనాడుకు చెందిన వీసీకే ఎంపీ తిరుమావళవన్ ఒక లేఖలో పిలుపిచ్చారు. ఆయన పార్టీకి లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్నారు. 2002 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భైరాన్‌సింగ్ షెకావత్‌కు 454 ఓట్లు- రాగా.. ఆయనపై బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్‌కుమార్ షిండేకు 302 ఓట్లు- వచ్చాయి. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనడు 516 ఓట్లు- సాధించగా.. ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధీకి కేవలం 244 ఓట్లు- వచ్చాయి. 2022 ఎన్నికల్లో జగదీప్ ధన్‌ఖడ్‌కు 520 ఓట్లు- వచ్చాయి. విపక్షాల ఐక్య అభ్యర్థి మార్గరెట్ ఆల్వా కేవలం 182 ఓట్లు- సాధించారు. ఈసారి ఎన్‌డీఏ అభ్యర్థికి 500 ఓట్లలోపే వచ్చే అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలు తమకు ఉన్న మొత్తం 324 ఓట్లు- సాధించినప్పటికీ.. అన్ని ఎక్కువ ఓట్లు- పొంది ఓడిపోవడం ఇదే మొదటిసారి అవుతుంది. చెల్లని ఓట్లపై రెండు కూటముల్లో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల ఓట్లు- చెల్లకపోవడమే దీనికి కారణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంపీలకు కూడా ఓటు- వేయడం రాకపోతే ఎలాగని ఉభయ కూటముల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీలు తమ ఓటింగ్ ప్రాధాన్యాలను అక్షరాల్లో కాకుండా అంకెల ద్వారా సూచించాలని.. కానీ కొందరు అది గ్రహించలేక పోతున్నారని వారు చెబుతున్నారు. అంతేగాక.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్దిష్ట పెన్నులతోనే వారు తమ ప్రాధాన్యాలను తెలుపవలసి ఉంటుంది. మరే ఇతర పెన్నులు వాడినా ఓటు చెల్లదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతి 15 మంది పార్టీ ఎంపీలకు ఒక సమన్వయకర్తను నియమించింది. ప్రతిపక్ష సభ్యులను సమన్వయపరిచేందుకు ప్రత్యేక బృందాలను మోహరించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేయనున్న మోడీ
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక మంగళవారం నాడు జరగనుంది. ఈ ఎన్నికలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేయనున్నారు. పంజాబ్, హర్యానా ఎంపీలతో కలిసి ప్రధాని తన ఓటు- హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేలను ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్షన్ ఏజెంట్లుగా నియమించారు. మంగళవారం ఉదయం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే ఎంపీలకు సోమవారం రాత్రి డిన్నర్ ఇచ్చారు. ఓటింగ్ సందర్భంగా ఎంపీల మధ్య పూర్తి సమన్వయం, ఐక్యతకు ఈ తరహా విందు సమావేశాలు ఎంతో ఉపకరిస్తుంటాయని ఎన్డీయే సీనియర్ నేత ఒకరు తెలిపారు. తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఎన్డీయే భాగస్వాముల నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పారు.