అసోంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అపూర్వ స్పందన
ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతిస్తే ప్రజాస్వామ్యం సజీవం
దేశంలోని ఎంపీలందరికీ ఇదొక సదావకాశం
గుహవటిలో జస్టిస్ బీఎస్ రెడ్డికి స్వాగతం పలికిన నేతలు
నేను ఉదారవాద, రాజ్యాంగ ప్రజాస్వామ్యవాదిని : జస్టిస్ బీఎస్ రెడ్డి
గుహవటి, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) :
అరవై శాతంపైగా ప్రజలు మద్దతు తెలిపిన కూటమి నుంచి ఉపరాష్ట్రపతి బరిలో నిలిచిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి అపూర్వ మద్దతు లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు కోరుతున్న ఆయన.. వ్యక్తిగత మద్దతు కూడగట్టే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఇప్పటికే లేఖలు రాసినట్టు వెల్లడిరచిన ఆయన.. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ సమావేశాల్లో ఎంపీల మద్దతు కోరుతున్నారు. శనివారం అసోం రాష్ట్రంలోని గుహవటి పట్టణానికి చేరుకున్న ఆయనకు ఎల్జీబీఐ ఎయిర్‌పోర్టులో స్థానిక నేతలు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి ఎన్నిక తనకు, రాధాకృష్ణన్ జీకి మధ్య జరిగే పోటీమాత్రమే కాదని, రెండు వేర్వేరు భావాజాలాలకు ప్రాతినిధ్యం వహించే పోటీ అని చెప్పారు. ప్రత్యర్థి ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని, తాను మాత్రం ఆ భావాజాలాన్ని సమర్థించబోనని అన్నారు. తాను ఉదారవాద, రాజ్యాంగ, ప్రజాస్వామ్యవాదినని చెప్పారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాననే నమ్మకముందని, ఎక్కడికి వెళ్లినా అద్భుత స్పందన లభిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యర్థి గురించి మాట్లాడటం తనకు అనుచితమని, ఆయన కూడా గౌరవప్రదమైన వ్యక్తేనని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మా కామాఖ్యను సందర్శించేవాడినని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తండ్రి రాష్ట్ర మాజీ సీఎం తరుణ్ గొగోయ్‌తో ఉన్న అనుబంధాన్ని జస్టిస్ బీఎస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
ఎంపీలందరికీ ఇదొక సదావకాశం : నేతల పిలుపు
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని సజీవంగా ఉంచడమే లక్ష్యంగా ఉపరాష్ట్రపతి బరిలో నిలిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం మంచి సదావకాశమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా అసెంబీ ప్రతిపక్ష, కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియా మాట్లాడుతూ.. బీజేపీ పట్ల దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా జరుగుతున్న భేటీలు, సమావేశాలు ఓ ప్రత్యామ్నాయ వేదికను సూచిస్తోందని అన్నారు. ఎన్‌డీయే కూటమిలోని ఎంపీలను సైతం సుదర్శన్ రెడ్డి ఆకర్షిస్తున్నారని చెప్పారు.
ఇదెంతో అద్భుతమైన రోజు : జస్టిస్ సుదర్శన్ రెడ్డి
మేమందరం కలిసి కొన్ని నిర్మాణాత్మక పనులు చేసేందుకు ప్రయత్నించాం. ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. తిరిగి మళ్లీ కర్మభూమికి వచ్చినట్టుగా ఉంది. ఇది ఎంతో అద్భుతమైన రోజు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ ముందుకొచ్చాను. అదేవిధంగా, ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక రాజకీయ సంస్థ కాదు. అత్యున్నత రాజ్యాంగ సంస్థ. ఏ వ్యక్తినీ ఎన్నికల్లో పాల్గొనకుండా మినహాయించడానికి ముందుగా రూపొందించిన మ్యాప్ ఉండకూడదు.