ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్
న్యూఢిల్లీ (జనంసాక్షి): ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. యూరియా ఇవ్వకుండా, రైతుల సమస్యను పరిష్కరించకుండా ఉండటమే కారణమని వెల్లడించింది. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నివిధాలుగా ఆలోచనలు వేసి, ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారని, యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, యురియా కొరతను తీర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశామని, రెండు ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనట్లు సురేశ్ రెడ్డి అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్‌పై నోటా అందుబాటులో లేదు కాబట్టి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఎంపీ తెలిపారు. తమ నిరసనను ఈ రకంగా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతలు .. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిస్తున్నారని, ఇలాంటి పరిస్థితిల్లో తమ పార్టీ నిర్ణయం తీసుకున్నదని, పార్టీ అధినేత కేసీఆర్‌తో జరిగిన చర్చల ఆధారంగా నిరసన వ్యక్తం చేసేందుకు ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సతాయిస్తున్నాయని, ఈ కారణంతోనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేయడం లేదని అన్నారు. పోటీల్లో ఉన్న ఇద్దరు అభ్యర్థులను అమితంగా గౌరవిస్తున్నామని, ఆ అభ్యర్థులు వారివారి రంగాల్లో నిష్ణాతులని, ఓ అభ్యర్థి స్వంత రాష్ట్రానికి చెందిన వ్యక్తే అని, కానీ రైతులను ప్రభుత్వాలు విస్మరిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు సురేష్ రెడ్డి చెప్పారు.