మేక న‌ల్లాను తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా

 

 

 

 

 

 

 

సెప్టెంబర్ 09 (జనం సాక్షి)మ‌ట‌న్‌ను తినే చాలా మంది వాటికి చెందిన ఇత‌ర భాగాల‌ను కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. భేజా, పాయా, బోటి, త‌ల‌కాయ‌.. లాంటి వాటిని మ‌ట‌న్ ప్రియులు ఎక్కువ‌గా తింటుంటారు. అయితే మేకకు చెందిన ఇంకో భాగం కూడా ఒక‌టి ఉంది. అదే న‌ల్లా. దీన్ని కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. న‌ల్లాను వేపుడుగా చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మ‌న దేశంతోపాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు కూడా మేక న‌ల్లాను తింటుంటారు. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. న‌ల్లాలో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. దీన్ని శ‌రీరం సుల‌భంగా శోషించుకుంటుంది కూడా. క‌నుక ర‌క్తం త‌క్కువగా ఉన్న‌వారు న‌ల్లాను తింటుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ఐర‌న్ లోపం స‌మస్య ప‌రిష్క‌రించ‌బ‌డుతుంది. నీర‌సం, అల‌స‌ట, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌గ్గిపోతాయి.

విట‌మిన్ బి12 అధికం..

న‌ల్లాలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తింటే కండ‌రాలకు మ‌ర‌మ్మ‌త్తులు జ‌రుగుతాయి. క‌ణజాలం వృద్ధి చెందుతుంది. హార్మోన్ల ఉత్ప‌త్తి పెరుగుతుంది. హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. శ‌రీర జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌బ‌డతాయి. న‌ల్లాలో విట‌మిన్ బి12 అధికంగా ఉంటుంది. సాధార‌ణంగా విట‌మిన్ బి12 జంతు సంబంధ ప‌దార్థాల ద్వారా మ‌న‌కు అధికంగా ల‌భిస్తుంది. క‌నుక న‌ల్లాను తింటుంటే ఈ విట‌మిన్ ను అధికంగా పొంద‌వ‌చ్చు. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి దోహ‌దం చేస్తుంది. చాలా మందికి విట‌మిన్ బి12 లోపం ఉంటుంది. వారు నాన్ వెజ్‌ను తింటే గ‌న‌క న‌ల్లాను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. దీంతో విట‌మిన్ బి12 లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఎముక‌ల ఆరోగ్యానికి..

న‌ల్లాను తిన‌డం వ‌ల్ల జింక్ అధిక మొత్తంలో ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. సీజ‌న‌ల్ వ్యాధుల‌కు చెక్ పెడుతుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌ను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గిపోతాయి. న‌ల్లాలో ఉండే సెలీనియం ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్రిస్తుంది. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. న‌ల్లాను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ఉంటారు. శారీర‌క శ్ర‌మ‌, వ్యాయామం చేసే వారికి న‌ల్లా ఎంతో మేలు చేస్తుంది. న‌ల్లాను తిన‌డం వ‌ల్ల ఇలా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే న‌ల్లా ఆరోగ్య‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ దీన్ని తినే విష‌యంలో ముందుగా ప‌లు విష‌యాల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది.

జాగ్ర‌త్త‌లు తప్ప‌నిస‌రి..

నల్లా మ‌న‌కు అన్ని చోట్ల శుభ్ర‌మైంది ల‌భించ‌దు. కొంద‌రు మ‌ట‌న్ వ్యాపారులు శుభ్ర‌త లేని చోట న‌ల్లాను ప‌ట్టి తెచ్చి విక్ర‌యిస్తారు. అలాంటి న‌ల్లాలో బ్యాక్టీరియా, వైర‌స్‌, ఇత‌ర క్రిములు ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి న‌ల్లాను తింటే ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రిగే ప్ర‌మాదం ఉంటుంది. ఇది తీవ్ర‌మైన ఇన్‌ఫెక్ష‌న్‌కు సైతం దారి తీస్తుంది. క‌నుక న‌ల్లాను తెచ్చుకునేట‌ప్పుడు అది శుభ్రంగా ఉందా లేదా అన్న విష‌యాన్ని తెలుసుకున్నాకే తెచ్చుకోవాలి. లేదంటే అనారోగ్యాల బారిన ప‌డ‌తారు. న‌ల్లాలో ఐర‌న్ అధికంగా ఉంటుంది క‌నుక ఐర‌న్ ట్యాబ్లెట్లు వాడేవారు దీన్ని తిన‌కూడ‌దు. తింటే శ‌రీరంలో ఐర‌న్ అధికంగా పేరుకుపోతుంది. ఇది లివ‌ర్‌, గుండె, క్లోమం వంటి భాగాల్లో నిల్వ అవుతుంది. అనంత‌రం ఆయా అవ‌య‌వాల‌కు న‌ష్టం జ‌రుగుతుంది. నల్లాను తెచ్చుకున్న త‌రువాత దాన్ని బాగా క‌డిగి శుభ్రం చేయాలి. అనంత‌రం దాన్ని బాగా ఉడికించాలి. దీంతో అందులో ఏమైనా క్రిములు ఉంటే న‌శిస్తాయి. న‌ల్లాను తిన‌డం ఆరోగ్య‌క‌ర‌మే అయినా దీన్ని ఒక కప్పు మోతాదుకు మించి తిన‌కూడ‌దు. ఇలా జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ దీన్ని తింటే లాభాల‌ను పొంద‌వ‌చ్చు.