ఆత్మప్రబోధానుసారం ఓటువేయండి
దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కండి
ఎంపీలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి
భారత ఆత్మ కోసం జరిగే ఎన్నికగా భావించాలని పిలుపు
ప్రజాస్వామ్యం బలోపేతం చేయాలని వీడియో సందేశం
హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) :
ఉప రాష్ట్రపతిని ఎన్నుకోవడమంటే ఓటు మాత్రమే కాదని, ఇది భారతదేశానికి స్ఫూర్తికి చిహ్నమని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీలు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేసి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు తన సందేశాన్ని చేరవేశారు. ఎంపీలు తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా తాను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇది కేవలం ఉప రాష్ట్రపతి కోసం జరిగే ఎన్నికగా చూడొద్దని, ఇది భారత ఆత్మ కోసం జరిగే ఎన్నికగా ఎంపీలు భావించాలన్నారు. అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.తనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం అంటే పార్లమెంటరీ సంప్రదాయాలను రక్షించడం, సమగ్రమైన చర్చను పునరుద్ధరించడమేనని చెప్పారు. తనం కోసం కాదు, మనల్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా నిర్వచించే విలువల కోసం మద్దతు కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో, పార్టీ విప్ ఉండదని, బ్యాలెట్ రహస్యంగా ఉంటుందని, ఏ రాజకీయ పార్టీ పట్ల విధేయత కాదు, దేశం పట్ల ప్రేమను వ్యక్తపరచాలని కోరారు. ప్రజాస్వామ్య బలోపేతానికి సమిష్టి ప్రయత్నంగా ఎన్నికను భావించాలన్నారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చ్కెర్మన్ కూడా అయినందున, పార్లమెంటరీ కమిటీలను బలోపేతం చేయడంలోనూ తోడ్పడతానని అన్నారు. ఆ ప్యానెల్లు ప్రభావవంతమైన చట్టాల తయారీకి వెన్నెముకగా ఉంటాయన్నారు. ఈ కమిటీలను పార్లమెంట్ వర్క్‌షాపులుగా పండిట్ జీ జవహార్‌లాల్ నెహ్రూ అభివర్ణించినట్టు గుర్తుచేశారు. ఇవి గంభీరత, స్వతంత్ర, ఏకాభిప్రాయ నిర్మాణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఎంపీలు దేశ మనస్సాక్షి, ఆత్మను కాపాడుకునే న్కెతిక బాధ్యతను మోస్తున్నారని, కలిసికట్టుగా మన గణతంత్రాన్ని బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. పార్లమెంటరీ పద్ధతులను పారదర్శకంగా, అందరినీ సమన్వయంతో పాల్గొనేలా ఉంచడం తన కీలక ప్రాధాన్యాతల్లో ఒకటని ఆయన అన్నారు. రాజ్యసభను దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా భావిస్తున్నట్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు.
తెలుగు రాష్ట్రాలు పునరాలోచించుకోవాలి..
తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల పార్టీలు పునరాలోచించుకోవాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది, తెలంగాణ అస్థిత్వం ఏమైపోయిందని ప్రశ్నించారు. తాను పోటీ చేస్తున్నది రాజకీయ పదవికి కాదని, రాజ్యాంగ పదవికి అని పేర్కొన్నారు. ఏన్డీయే కూటమి అభ్యర్థికే తమ మద్దతు అని వైసీపీ స్పష్టంగా చెప్పిందని, టీడీపీ, బీఆర్‌ఎస్ నుంచి స్పందన లేకపోవడం శోచనీయం అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమి పక్షాలన్నీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకె), శివసేన (యుబిటి), ఆమాద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీలు జస్టిస్ రెడ్డికి ఓటు వేస్తామని ప్రకటించిన విషయం విదితమే.
‘జస్టిస్’కు ఏఐఎంఐఎం మద్దతు
ఓవైసీకి సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) మద్దతు తెలిపింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రకటించారు. తాను జస్టిస్ రెడ్డితో కూడా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేసినట్టు పేర్కొన్నారు. ఓవైసీ నిర్ణయం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ముందుకు వచ్చినందుకు అసదుద్దీన్ ఓవైసీ భాయ్‌కి ధన్యవాదాలు అని సీఎం రేవంత్ తన పోస్టులో పేర్కొన్నారు. అదేవిధంగా తెలుగు ఆత్మగౌరవం నినాదంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ, ఏపీలోని అన్ని పార్టీలను సీఎం రేవంత్ కోరారు. ఇండియా కూటమిలో భాగస్వామి కానప్పటికీ ఎంఐఎం పార్టీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించడం గమనార్హం.
పౌర సమాజం ఒక్కటై.. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు
వంద మందికిపైగా మేధావుల సంతకాలు
ఎంపీలు అంతర్గత స్వరాన్ని వినిపించాలని విజ్ఞప్తి
పాలనపై నమ్మకాన్ని పునర్నిర్మించేందుకు ఇదో అడుగు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) :
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా దేశవ్యాప్తంగా పర్యటించి, పార్టీలకతీతంగా మద్దతు కోరిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పౌరసమాజం అండగా నిలిచింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రజాస్వామ్య రక్షణగా అభివర్ణించింది. ఎంపీలు తమ అంతర్గత స్వరాన్ని వినిపించాలని, పాలనపై నమ్మకాన్ని పునర్నిర్మించేందుకు ఇదొక అవసరమైన అడుగుగా భావించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రొఫెసర్ కోదండరామ్, సీనియర్ జర్నలిస్టులు కె. రామచంద్ర మూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్యవంటి తెలంగాణలోని ప్రముఖ మేధావులు, పౌర సమాజ నాయకులు, జర్నలిస్టులు.. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపారు. పార్టీలకతీతంగా ఓటు వేసి భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలను కాపాడాలని పార్లమెంటు సభ్యులను కోరుతూ ముక్తకంఠం వినిపించారు.100 మందికిపైగా సభ్యులు సంతకం చేసిన సమిష్టి విజ్ఞప్తిలో.. దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలు గత దశాబ్దంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డిని సామాజిక న్యాయం పట్ల నిబద్ధత కలిగిన న్యాయనిపుణుడిగా అభివర్ణించారు. రాజ్యంగ విలువలను స్థిరంగా నిలబెట్టిన ఆయన.. అణగారినవర్గాల పట్ల నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాజ్యసభ ఒత్తిడికి లోనవుతుందని, పాలక, ప్రతిపక్షాల మధ్య నిర్మాణాత్మక చర్చకు అవకాశం తక్కువగా ఉందని మేధావులు తమ విజ్ఞప్తిలో పేర్కొన్నారు. ఇది పరిస్థితి సభలో చర్చా ప్రక్రియను దెబ్బతీసిందని, పార్లమెంటు సభ్యులు తమ రాజ్యాంగ విధులను సమర్థవంతంగా నిర్వర్తించకుండా అడ్డుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోయే తరాలు గుర్తుంచుకునేలా పార్లమెంటు సభ్యులు వ్యవహరించాల్సిన అరుద్కెన క్షణమని అన్నారు. జస్టిస్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ద్వారా ఎంపీలు ప్రజాస్వామ్య సంప్రదాయాలను పునరుద్ధరించడంలో, పార్లమెంటరీ సంస్థలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో సహాయపడగలరని పేర్కొన్నారు. సంతకాలు చేసినవారిలో మాజీ రాజ్యసభ సభ్యుడు సీహెచ్ హనుమంత రావు, ఎన్‌సీపీసీఆర్ మాజీ చ్కెర్‌పర్సన్ ప్రొఫెసర్ శాంత సిన్హా, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ మహ్మద్ సులేమాన్ సిద్ధిఖీ, టీఎస్‌సీహెచ్‌ఈ మాజీ చ్కెర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చ్కెర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, మాజీ అడ్వకేట్ జనరల్ డి ప్రకాష్ రెడ్డి, హెచ్‌సీయూ మాజీ ప్రొఫెసర్ జి. హరగోపాల్, తెలంగాణ మీడియా అకాడమీ చ్కెర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, కట్టా శేఖర్ రెడ్డి, తెలకపల్లి రవి, దేవులపల్లి అమర్ తదితరులు ఉన్నారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
` జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా వ్యాఖ్యలు దురదృష్టకరం
` హైకోర్ట్ జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్
హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు ఇస్తూ తీర్పునిచ్చారని ఆరోపించడం దురదృష్టకరమని ఉమ్మడి ఏపీ హైకోర్టు (రిటైర్డ్) జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి సంఫీుభావంగా ఆదివారం ఉదయం సికింద్రాబాద్ బోయిగూడలోని నాలెడ్జ్ సెంటర్‌లో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు బన్నూరు కొండారెడ్డి అధ్యక్షతన న్యాయవాదుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గురించి చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేకపోవడంతో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా నిస్సత్తువ ఆరోపణలు చేస్తున్నారని జస్టిస్ చంద్రకుమార్ మండిపడ్డారు.రాజ్యాంగాన్ని బ్రష్టుపట్టించడానికి అనైతికచర్యలకు పాల్పడుతున్నారని, దీనికి నిలువెత్తు నిదర్శనం 58వ స్థానంలో ఉన్న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపుల్ మనుభాయ్ పంచోలిని ఇటీవల భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారని, సుప్రీంకోర్టు కొలీజియంలోని జస్టిస్ నాగరత్న వ్యతిరేకించినా పట్టించుకోలేదని ఆయన వివరించారు.రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరది. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరిపై ఉందని జస్టిస్ చంద్రకుమార్ నొక్కిచెప్పారు. ఇప్పటికైనా గ్రహించి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యతిరేకతకు జరుగుతున్న పోరని, రాజ్యాంగపరిరక్షణకు మనమందరం పాటుపడాలని అన్నారు.సీనియర్ జర్నలిస్ట్ రెహ్మాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అడ్వకేట్ల పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. బిఆర్‌ఎస్ నేతలు ఎరువు బస్తాలు ఇస్తే ఓటేస్తామని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని అనడం హాస్యాస్పదమని, ఎరువు బస్తాలకు, ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏమైనా సంబంధముందా అని రెహ్మాన్ ప్రశ్నించారు ? బిఆర్‌ఎస్ కు ఉన్న ఆ రెండు ఓట్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి వేయకపోతే భవిష్యత్తులో బిఆర్‌ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు క్షమించరని రెహ్మాన్ హెచ్చరించారు.సమావేశంలో కన్వీనర్ బన్నూరు కొండారెడ్డి న్యాయవాదుల తరపున ఎంపీలందరికీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఓటువేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించాలంటూ ‘‘ఈ-మెయిల్స్’’ పంపిద్దామని తీర్మానం ప్రవేశపెట్టగా న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. న్యాయవాదులతో కిక్కిరిసిన సమావేశ హల్ లో ఏపీసీఎల్సీ నేత సురేష్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రొఫెసర్ వాగేష్, గోవర్ధన్, సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ బాబు, బీవీ శేషగిరి, డా. అశోక్ కుమార్ తదితరులు ప్రసంగించారు.ఏఎంఏసీఎస్ డైరెక్టర్లు తోర్నాల గిరి, అర్ముల మహేశ్వర్, హయత్నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోడెం ప్రభాకర్ గౌడ్,అడ్వకేట్లు టీవీఎం శ్రీనివాస్, మల్కన్గిరి రవికుమార్, ఉమర్, ఎ. నరేన్ రాజా, పట్లోల్ల జగన్మోహన్ రెడ్డి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.