గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

బక్రీద్ సందర్భంగా గోవుల కుర్బానీ వద్దు.. హిందువుల మనోభావాలను గౌరవిద్దాం
మునుగోడు నియోజకవర్గ మైనార్టీ సంఘము కోఆర్డినేటర్ అబ్దుల్ రజాక్
మర్రిగూడ , మే 24 (జనం సాక్షి) గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మునుగోడు నియోజకవర్గ మైనార్టీ సంఘము కోఆర్డినేటర్ అబ్దుల్ రజాక్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “భారతదేశంలో గోవును కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావిస్తారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు, హిందువుల మనోభావాలను గౌరవిస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను కుర్బానీ ఇవ్వకూడదని ముస్లిం మత పెద్దలు తీసుకున్న నిర్ణయం అభినందనీయం” అని పేర్కొన్నారు.
“దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలంటే అన్ని మతాల ప్రజలు ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకోవాలి. ఈ మేరకు ముస్లిం పెద్దలు ముందడుగు వేయడం హర్షించదగ్గ విషయం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు” అని అబ్దుల్ రజాక్ తెలిపారు.
గో సంరక్షణ కేవలం ఒక మతానికి సంబంధించిన అంశం కాదని, భారతీయ సంస్కృతి, వ్యవసాయ రంగానికి గోవు వెన్నెముక అని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే గోవును జాతీయ జంతువుగా ప్రకటించి చట్టపరమైన రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరారు.



