ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతికి అంకురార్పణ
మక్తల్, (జనంసాక్షి) : మక్తల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం 2025 పైన రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకొస్తామని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభసందర్భంగా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు అని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తొలి విడత భూ భారతిని మక్తల్ మండలాల్లో చేపడుతునము. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువలో ఉంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసమే 10954 గ్రామ పాలన అధికారులను నియమించబోతున్నాం అన్నారు. గత పాలకుల తరహాలో రెవెన్యూ సిబ్బందిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు ప్రజా ప్రభుత్వం వ్యతిరేకం. అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా వ్యవహరిస్తాం.కానీ వ్యవస్థపై కాదు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలి. ప్రభుత్వలక్ష్యం నెరవేరాలంటే రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఆ పనిని చేయగలరు. రెవెన్యూ సిబ్బంది రైతాంగాన్ని రెండు కళ్ల లాంటి వారు. రెవెన్యూ శాఖపైన కొందరు సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఆర్ ఓఆర్ భూమి హక్కుల పరిరక్షణ, రిజిస్ట్రేషన్ ముటిషన్ జరుగుతాయని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటిషన్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసీల్దార్ సతీష్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,యువ నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.